
ఉలికిపాటు..!
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● ఆర్టీసీలో వచ్చిన పార్శిల్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు
● ఆర్టీసీ కార్గోలో ఘటన
● ఫ్యాన్సీ వస్తువుల పేరిట పార్శిల్
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతమంతా ఉలిక్కిపడింది. మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో విజయనగరం నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులో 25 కిలోల బరువున్న ఓ పార్శిల్‌ను ఆర్టీసీ కార్గో వద్ద దించేందుకు డ్రైవర్ తెర్లి రవి కాంప్లెక్స్‌లోని హమాలీ రెడ్డి రమేష్‌ను పిలిచి అందించాడు. పార్శిల్‌ను హమాలీ ఆర్టీసీ కార్గో కార్యాలయం ఎదుట దించుతున్న సమయంలో భారీ శబ్ధంతో పేలడంతో హమాలీతో పాటు డ్రైవర్, కార్యాలయానికి సమీపంలో ఉన్న కింతలి రమేష్, రిక్షా కార్మికుడు బోనెల సుందరరావు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆటో, 108 సాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో రెడ్డి రమేష్, టి.రవిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కింతలి రమేష్‌ను విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి, ఏఎస్పీ అంకితా సురానా ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన తీరు ను పరిశీలీంచారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పార్శిల్ విజయనగరంలోని సాంబయ్య అనే వ్యక్తి కొమరాడ మండలం నిమ్మలపా డు గ్రామానికి చెందిన కొత్తకోట కిశోర్ కు పంపినట్టు ప్రాథమికంగా తేలింది. కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసు కుని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ కార్గో నిబంధనలకు విరుద్ధంగా మందుగుండు సామగ్రిని బుక్ చేసిన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. పేలుడు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే
అలజంగి పరామర్శ
ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ప్రయాణికుల బస్సుల్లో ప్రమాదకర, పేలుడు పదార్ధాలు, సామగ్రి తరలించకూడదన్న నిబంధనలు ఉన్నా ఇటువంటి పేలుడు పదార్ధాలు పార్శిల్‌లో వేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు పదార్ధాలను ఎలా ప్రయాణికుల బస్సులో అనుమ తించారన్న ప్రశ్న లేవనెత్తింది. ప్రయాణికుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బాణసంచా పేలుడు సామగ్రిని ఎలా రవాణాకు అధికారులు అనుమతించారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా? అని నిలదీస్తున్నారు. ఆర్టీసీలో నిఘా నిద్దరోతుందా... అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉలికిపాటు..!

ఉలికిపాటు..!