
తప్పని డోలీ మోత
కొమరాడ: మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. తాజాగా పూడేస్ పంచాయతీ గుమ్మడింగి గ్రామానికి చెందిన ఆరిక దండు అనారోగ్యానికి గురవడంతో శనివారం లేవలేని స్థితిలోకి వెళ్లాడు. గ్రామానికి రహదారి లేకపోవడంతో... 108 వాహనం వెళ్లే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులు సుమారు నాలుగు కిలోమీటర్లు డోలీలో తీసుకువెళ్లారు. అక్కడ నుంచి ఒడిశా సరిహద్దు కొరాపుట్ జిల్లా బంధుగాం బ్లాక్ అలమండ గ్రామం మీదుగా ప్రైవేటు వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జ్వరాలు
పాచిపెంట: మండలంలోని వేటగానివలస గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతూ.. గురువునాయుడుపేట పీహెచ్‌సీలో శనివారం చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైరల్ ఫీవర్‌గా గుర్తించిన వైద్యులు అవసరమైన మందులు ఇచ్చిన పాఠశాలకు పంపారు. వీరిలో గిన్నిపల్లి ప్రవీణ్ అనే విద్యార్థికి జ్వరం తగ్గకపోవడంతో సాలూరు సీహెచ్‌సీకి ఆదివారం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల్లో విద్యార్థికి నెగిటివ్ రావడంతో ప్రవీణ్‌ను సోమవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపినట్టు హాస్టల్ వార్డెన్ భాస్కరరావు తెలిపారు.