
మార్కెట్‌లో పెండలం
● ఆరంభమైన సీజన్
● పెరిగిన దిగుబడులు
● ఏజెన్సీలో వంద ఎకరాలకు పైగా సాగు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో విస్తృతంగా పండే పెండలం సీజన్ ఈ ఏడాది ఆరంభమైంది. దిగుబడులు బాగా పెరిగినట్లు గిరిజనులు చెబుతున్నారు. మైదాన ప్రాంత వ్యాపారులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంతగా పెట్టుబడులు అక్కర్లేక పోయినప్పటికి ఈ పంట వేసుకుంటే మంచి ఆదాయవనరులు వస్తాయని గిరిజనులు తెలియజేస్తున్నారు. సీతంపేట, బామిని ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాలకు పైగా కొండ పోడు వ్యవసాయంలో భాగంగా పెండలం పండిస్తారు. కావిళ్లలో కట్టలు కట్టి తీసుకువచ్చి గిరిజనులు విక్రయిస్తారు. ఒక్కో కట్ట రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నామని గిరిజనులు తెలిపారు. గతేడాది ఇదేసీజన్‌లో ఒక్కో కావిడి రూ.300ల వరకు విక్రయించేవారమని అంటున్నారు. ఇలా కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లోని మార్కెట్‌లో కిలోల వంతున కిలో రూ.90 వరకు విక్రయిస్తారు. ఒక్కో పెండలం కట్టకు రూ.200 వరకు ఆదాయం వస్తుందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే కందను కూడా బుట్టల లెక్కన ఒక్కో బుట్ట వంద వరకు కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతాల్లో రూ.300ల వరకు అమ్మకాలు జరుపుతారు.
మైదాన వ్యాపారులదే హవా
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి పెండలం కొనుగోలు చేస్తారు.గతంలో సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయిలో కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసేవారు. అయితే కోవిడ్–19 కారణంగా వారపు సంతలు తగ్గాయి. నామమాత్రంగా అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చి గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని సందర్భాల్లో ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరలకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులకు ఇస్తారు. పాండ్ర, కొండాడ, చింతాడ, జగతపల్లి, అక్కన్నగూడ, బెన్నరాయి, గాటిగుమ్మడ, సీదిగూడ తదితర గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా పండుతుంది.
గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది
కావిళ్లు మోసుకుని తీసుకువస్తాం. గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ప్రత్యేక మద్దతు ధరలు లేవు. దీంతో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు అమ్మకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు.
ఎస్.తోటయ్య, మూలగూడ
తవ్వితీయడం చాలా కష్టం
కొండపోడు వ్యవసాయంలో పెండలాన్ని పండిస్తాం. ఎంతో శ్రమకోర్చి పెండలాన్ని తవ్వి తీస్తాం. వ్యాపారులు నిర్ణయించిన ధరలకు విక్రయించాల్సి వస్తోంది. ధరలు పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎస్.సుక్కయ్య, ఈతమానుగూడ

మార్కెట్‌లో పెండలం