
చేతకాని మంత్రికి రెండు పదవులు అవసరమా?
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
● నియోజకవర్గంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
సాలూరు: గిరిజనులకు అండగా నిలవలేని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎమ్‌ల నియామకంపై తొలిసంతకం చేసి నేటికీ అమలుచేయలేని మంత్రి సంధ్యారాణికి రెండు పదవులు అవసరమా? మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల మరణాలపై పభుత్వం చోద్యం చూస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు పదిలక్షల రుపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నార న్నారు. కాగా జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలపై మంత్రి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తారా? అంటూ మంత్రి సంధ్యారాణిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీ్త్రశిశుసంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఆమె తన శాఖలకు న్యాయం చేయలేక అసమర్థ మంత్రిగా నిలిచారని, పదవులకు న్యాయంచేయలేని మీకు రెండు పదవులు అవసరమా? అంటూ మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గురుకులాల్లో తాము ఏఎన్‌ఎమ్‌ల నియామకం చేపట్టామని, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎమ్‌ల నియామకంపై తాను ఫైల్ పెట్టానని, సీఎం వద్ద ఫైలు ఉండగా ఎన్నికలు వచ్చాయని కావాలంటే వారు ఆఫైల్‌ను తెప్పించుకోవచ్చ న్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాము మంజూరుచేసిన రోడ్ల పనులు, ఆ బిల్లులు జరగాలన్నా ఆ ప్రాంతాల గిరిజన నాయకులు తమ పార్టీలోకి వస్తేనే బిల్లులు అవుతాయంటూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునని, అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు తానెప్పుడూ సిద్ధమని, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి తాను చర్చకు వస్తానని సవాల్ విసిరారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడేవన్నీ అబద్ధాలేనని, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో కూటమి ప్రభుత్వంలో 14 మంది గిరిజన విద్యార్థులు మరణించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఇకనైనా మంత్రి సంధ్యారాణి విమర్శలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.