
పరమ పవిత్రం కార్తీకం
● కార్తీక దీక్ష శ్రేష్టం
● ఓ వైపు ముక్తి..మరో వైపు ఆరోగ్యం..
● నెలరోజుల దీక్షతో ఎన్నో ఫలితాలు..
రాజాం: కార్తీకమాసం పవిత్రమైన మాసం. ఈనెల 22 నుంచి కార్తీక దీక్షలు, పూజలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లో శివాలయాలు ఈ పూజలకు సిద్ధమయ్యాయి. కార్తీకమాసంలో చేపట్టే నెలరోజుల దీక్ష ఓ వైపు ముక్తిని, మరో వైపు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక దీపం ఎంతో పవిత్రమైనది. ఈ నెలరోజులు దీపం వెలిగించినా, ఆలయాల వద్ద, ఇండ్ల వద్ద వెలిగించిన దీపాన్ని దర్శించినా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ కార్తీకంలో వేకువజామున చేసే స్నానాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఆయుష్షును పెంచుతాయి. దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తాయి. దీపారాధనతో ఆధ్యాత్మిక భావనలో ఉన్నవారికి శాంతిభావం పెంపొందుతుంది. వనసమారాధనలు, సామూహిక భోజనాలు ఐక్యతను చాటుతాయి. శివ, కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.
కార్తీక దీపం అంటే..
కార్తీకమాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానమాచరించాలి. అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపం కార్తీకమాసంలో వెలిగించడం, నది, ప్రవహిస్తున్న సెలయేరుల్లో విడిచిపెట్టడం, ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలు పాటించాలి. కార్తీకమాసమంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్రం శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో గోపుర ద్వారం వద్ద దేవుని సన్నిధానం, ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వపాపాలు హరిస్తాయని, వైకుంఠప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం చెబుతోంది.
దీపారాధనకు ప్రాముఖ్యం
ఈ నెలలో ఆలయాల వద్ద ఇతరులు వెలిగించిన దీపాలు ఆరిపోకుండా చూసినా పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి తదితర దినాల్లో సాయం సమయాల్లో శివాలయాల్లో ఉసిరికాయపైన వత్తులు వేసి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిశనూనె, విప్ప నూనె, ఆముదంతోనైనా దీపాలు వెలిగించాలి.
నెలరోజుల దీక్ష..
కార్తీక స్నానాన్ని ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి రోజు నుంచి ప్రారంభించచాలి. నెలంతా కార్తీకస్నానం చేయడం మంచిది. వీలుకాని వారు సోమవారాల్లోనూ, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లోనైనా తప్పక ఆచరించాలి. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజచేయాలి. ఈ నెలంతా శ్రీ హావిష్ణువును తులసీదళాలు, జాజిపూలతో పూజించాలి. ఈ నెలంతా శివుడిని మారేడు దళాలు, జిల్లేడు పూలతో పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది.

పరమ పవిత్రం కార్తీకం

పరమ పవిత్రం కార్తీకం