
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
గుమ్మలక్ష్మీపురం: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలం జొల్లగూడ గ్రామానికి చెందిన నిమ్మల జితేంద్ర, బిడ్డిక హర్షవర్ధన్ ఎంపికై నట్లు కొత్తగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల పీడి నిమ్మక మాధవరావు, ఎన్‌ఐఎస్ ఫెన్సింగ్ కోచ్ బాలరాజు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈమేరకు ఈనెల 17వ తేదీన విజయనగరంలోని విజ్జి స్టేడియంలో జరిగిన సబ్ జూనియర్ బాల బాలికల ఫెన్సింగ్ ఎంపిక పోటీల్లో వీరిద్దరూ ఉత్తమ ప్రతిభ కనపరి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని, ఈనెల 18వ తేదీన కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వేదికగా నిర్వహించిన 12వ సబ్ జూనియర్ అంతర జిల్లా బాల బాలికల ఫెన్సింగ్ పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబర్చారని, వ్యక్తిగత విభాగంలో చూపిన ప్రతిభకు జితేంద్ర, హర్షవర్థన్ కాంస్య పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా ఉత్తమంగా రాణించాలని పిలుపునిచ్చారు.