
అధికారులకు దీపావళి
మళ్లీ పండగొచ్చింది
షాపుల వారీగా వసూళ్లు
సిండికేట్ కలెక్షన్ ఫుల్
సాక్షి ప్రతినిధి, విజయనగరం :
అదేమిటో.. జిల్లా అధికారులకు అదృష్టం ముసురు పట్టినట్టు పట్టింది. వద్దంటున్నా కనక వర్షం కురిసేస్తుంది. మొన్న మొన్నటి వరకు పైడితల్లి అమ్మవారి పండగ పేరు చెప్పి కలెక్షన్ చేసిన రెవెన్యూ.. పోలీస్.. మున్సిపల్ అధికారులకు... ఇంకా ఆ డబ్బులు ఖర్చుపెట్టక ముందే వారికి ఇంకో పండగ వచ్చి పడింది. ఈసారి దీపావళి ధమాకా... బాణసంచా షాపులు పెట్టాలంటే భారీ స్థాయిలో అనధికారిక ఫీజులు చెల్లించాల్సిందే.. లేకుంటే మతాబులు అమ్మేందుకు లైసెన్సు ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో ఈ దీపావళి వ్యాపారం చేసే వ్యాపారులు అడిగిన కాడికి ముడుపులు ఇచ్చుకోక తప్పలేదు.
విజయనగరంలోని ఆర్టీవో ఆఫీస్ వద్ద కె.ఎల్.పురంలో ఎప్పట్లానే ఈసారి కూడా మతాబులు షాపులకు తాత్కాలిక లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ దాదాపు 32 షాపులు ఏర్పాటు చేయగా ఫైర్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసులు ఇలా వేర్వేరు శాఖలకు ముడుపులు ఇచ్చుకొని షాపులు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో శాఖకు వేర్వేరుగా ఇవ్వడం అదంతా ఇబ్బందికరమైన వ్యవహారం కావడంతో గంపగుత్తగా ఒక్కో షాపు నుంచి రూ.50వేలు వసూలు చేసి అన్ని శాఖలతో కలిపి పంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే కెఎల్.పురంలోని షాపుల నుంచే రూ.16లక్షలు వసూలైందన్న మాట. ఇది కాకుండా లోయర్ ట్యాంక్ బండ్ వద్ద తాత్కాలికంగా 18 షాపులు ఏర్పాటు చేయగా అది మాన్సాస్ స్థలం కాబట్టి ఒక్కో షాపు రూ.20 వేల చొప్పున రౌడీ మామూలు చెల్లించాల్సిందే.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తాలూకా అనుచరుడు దందా చేసినట్టు తెలుస్తోంది.
పెద్దమ్మికే పెద్దరికం
పట్టణంలోని మతాబుల షాపుల నుంచి మామూలు వసూలు చేసే బాధ్యత రెవెన్యూ శాఖకు చెందిన పెద్దమ్మికి ఆయా శాఖలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అమ్మవారి పండగలో కూడా పెద్దమ్మి చెయ్యి బాగా తిరిగిందని... ఆమె చేత్తో బోణి బాగుంటుందని నమ్మకంతో ఫైర్, పోలీస్, మున్సిపల్ అధికారులు సైతం ఆమెకే కలెక్షన్ బాధ్యత అప్పగించి వసూలు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఒక్కో షాపు నుంచి రూ.50వేలు చొప్పన బాణసంచా వ్యాపారుల సంఘం వసూలు చేసి రెవెన్యూ పెద్దమ్మికి ముట్ట చెప్పగా ఆమె తన వాటా మినహాయించుకుని మిగతా వాళ్లకు కొంత పంపిణీ చేసినట్టుగా చెబుతున్నారు. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వ్యాపారాల మీద నమ్మకం లేదని... ఆదివారం సాయంత్రం కూడా నగరంలో భారీగా వాన కురవడంతో ప్రజలు టపాసులు కొనేందుకు వీధుల్లోకి రావడం లేదని, ఇలాంటి గడ్డు కాలంలో రూ.వేలకు వేలు ముడుపులు ఇచ్చుకొని చేసేంత వ్యాపారం ఏమీ లేదని... తెచ్చిన సరుకు తడిసిపోయి... తమకు నష్టాల భయం పట్టుకుందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మీ నష్టాలతో మాకేం సంబంధం.. మీకు లాభం వస్తే మాకు వాటా ఇస్తారా..? ఇవ్వరు కదా... కాబట్టి జస్ట్ మామూళ్లు ఇచ్చి బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోండి అంటూ అధికారుల సిండికేట్ అల్టిమేటం జారీ చేయడంతో అడిగినంత ఇచ్చుకోక వ్యాపారులకు తప్పలేదు.