
కార్పొరేట్ మతతత్వ శక్తులపై పోరాడదాం
● కడపలో మహాసభలను విజయవంతం చేయాలి
● సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పిలుపు
విజయనగరం గంటస్తంభం: కార్పొరేట్ మతతత్వ మనువాద శక్తులను ప్రతిఘటించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం వర్ధిల్లే ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దామనే పిలుపుతో, డిసెంబర్ 6,7 తేదీల్లో కడపలో జరగనున్న సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విజయనగరంలోని ఊటగెడ్డ వద్ద పార్టీ జెండాను జిల్లా కమిటీ విడుదల చేసిన కరపత్రాన్ని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఎం.అప్పలరాజు, బి.గిరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని మిమర్మించారు. జీఎస్టీ శ్లాబ్ రేటు తగ్గించడం ద్వారా ధరలు తగ్గిపోయాయని, ఆదాయాలు పెరిగాయని పాలకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వాస్తవానికి 18శాతం జీఎస్టీ శ్లాబ్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ప్రజలపై మరింత భారం పడుతోందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేసి కార్బొరేట్లకు లాభాలు చేకూర్చారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో విప్లవ వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కడపలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, యువత అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.గౌతమి, పార్టీ నాయకులు జి.సత్యారావు, ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.