
రియల్ మోసంపై..స్పందించిన అధికారులు..
చీపురుపల్లి: మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా వెలసిన మెగా వెంచర్ మోసంపై అధికారులు స్పందించారు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలోని మెగా వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆదివారం ‘సాక్షి’ పత్రికలో ‘రియల్‌గా మోసం’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీనికి ఎంపీడీఓ ఐ.సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది స్పందించారు. ఆదివారం చిననడిపల్లి పరిధిలోని అనుమతులు లేని మెగా వెంచర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ మాట్లాడుతూ అనుమతి లేని లేఅవుట్‌కు సంబంధించిన యజమాని అందుబాటులో లేరని చెప్పారు. అయితే ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్‌లో ఎవ్వరూ ప్లాట్లు కొనుగోలు చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అదేశించినట్లు చెప్పారు. అంతేకాకుండా అనుమతులు లేని ఇక్కడి లే అవుట్‌కు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని వీఎంఆర్‌డీఏకు సూచనలు తెలియజేస్తూ నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అలాగే సదరు వెంచర్ అభివృద్ధిని తక్షణమే నిలుపుదల చేయాలని సంబంధిత వెంచర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు.