విజయనగరం ఫోర్ట్: రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంఈ (వైద్య విద్యా సంచాలకులు) డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ విభాగాన్ని, క్యాజువాలటీ, ల్యాబొరేటరీ, ఫిమేల్ శస్త్రచికిత్సల వార్డు, పురుషల మెడికల్ వార్డును, ఎక్సరే, స్కానింగ్‌లను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులకు అవసరమైన చికిత్స, మందులు అందజేయాలన్నారు. శస్త్రచికిత్సల కోసం ఆస్పత్రిలో చేరిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి శస్త్రచికిత్స సకాలంలో చేయాలన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని సూచించారు. అనంతరం ఎండోస్కోప్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఈని వైద్యులు సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ రమణి, డాక్టర్ శివశ్రీధర్, ఎముకలు, మత్తు, న్యూరోసర్జరీ, డెర్మాటాలజీ హెచ్‌వోడీలు డాక్టర్ లోక్‌నాధ్, డాక్టర్ జయధీర్‌బాబు, డాక్టర్ ప్రహ్లాదరెడ్డి, డాక్టర్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.