‘రియల్‌’గా మోసం..! | - | Sakshi
Sakshi News home page

‘రియల్‌’గా మోసం..!

Oct 19 2025 6:35 AM | Updated on Oct 19 2025 6:35 AM

‘రియల

‘రియల్‌’గా మోసం..!

‘రియల్‌’గా మోసం..!

చీపురుపల్లి: వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా.. అనే సామెతలా ఏం చేసినా చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం ఉండగా మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రియల్టర్లు రెచ్చిపోతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పెద్ద పెద్ద వెంచర్లు వేసి దూర ప్రాంతాల్లో ఉండే కొనుగోలుదారులను మోసం చేసి యథేచ్ఛగా అమ్మకాలు జరిపేస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టే వదిలేస్తున్నారు. దీని వెనుక రియల్టర్లతో అధికార యంత్రాంగానికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమనే చర్చ జరుగుతోంది. దీనికి మండలంలోని చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో వెలిసిన 69 ఎకరాల మెగా వెంచర్‌ చక్కని అద్దం పడుతోంది. ఈ మెగా వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్‌గా కొనుగోలుదారులను మోసం చేసి అమ్మకాలు జరుపుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి అనుమతులు లేని ఈ వెంచర్‌లో ప్లాట్‌ నంబర్లు వేసి మరీ దర్జాగా సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి.

చిననడిపల్లి రెవెన్యూలో 69 ఎకరాల మెగా వెంచర్‌

మండలంలోని శివారు పంచాయతీ చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో మండల సర్వేయర్‌ తెలిపిన సర్వే నంబర్లు ప్రకారం సర్వే నంబర్‌ 73, 94, 93, 92ల్లో దాదాపు 69 ఎకరాల వ్యవసాయ భూమిని చదును చేసి మెగా రియల్‌ వెంచర్‌ను సిద్ధం చేశారు. అందు లో స్థలాలను ప్లాట్లుగా విభజించి రోడ్లు వేసి సిద్ధం చేశారు. ప్రస్తుతం సర్వే నంబర్‌ 73కు చెందిన ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నాయి. చిననడిపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని కమ్మసిగడాం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మెగా వెంచర్‌లో ఇప్పటికే ప్లాట్లు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

పంచాయతీ, ఉడా అనుమతులు లేకుండానే..

సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదట. అంతేకాకుండా కనీసం పంచాయతీ తీర్మానం ద్వారా అనుమతులు, ఉడా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

మోసపోతున్న కొనుగోలుదారులు

ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడి మెగా వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ఎంతో మంది కొనుగోలుదారులు మోసపోతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పంచాయతీ, ఉడా అనుమతులు లేని ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకోవాలన్నా బ్యాంకు రుణాలు కూడా రావు. అంతేకాకుండా పంచాయతీ ఇంటి నిర్మాణ ప్లాన్‌ అనుమతులు కూడా ఇవ్వదు. ఇవన్నీ తెలియకుండానే కొనుగోలుదారుకు ఏవో మాయ మాటలు చెప్పి రియల్‌ ఎస్టేట్‌ యజమానులు ప్లాట్లు అంటగడుతున్నట్టు చర్చ జరుగుతోంది. మండలంలోని పత్తికాయవలస సమీపంలో గతంలో ఇలాంటి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మకాలు జరిపారు. ఇప్పుడు ఆ వెంచర్‌లో రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలుస్తోంది.

69 ఎకరాల్లో అనధికారికంగా వెంచర్‌

పంచాయతీ, ఉడా అనుమతులు

లేకుండానే..

ప్లాట్‌ నంబర్లతో దర్జాగా రిజిస్ట్రేషన్లు

చూసీ చూడనట్టు వదిలేస్తున్న అధికారులు

అనుమతులు లేకపోయినా రిజిస్ట్రేషన్‌ చేయొచ్చు..

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు సంబంధించి పంచాయతీ, ఉడా అనుమతులు లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయొచ్చు. చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్‌ 73లో మెగా వెంచర్‌లో ప్లాట్‌ నంబర్‌లతో సహా రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.

– లక్ష్మణరావు, సబ్‌ రిజిస్టార్‌, చీపురుపల్లి

చర్యలు తీసుకుంటాం..

చిననడిపల్లి రెవెన్యూ పరిధిలో సిద్ధమైన మెగా వెంచర్‌ తమ దృష్టికి ఇంతవరకు రాలేదు. ఇంతవరకు ఎలాంటి వెంచర్లకు అనుమతులు ఇవ్వలేదు. తక్షణమే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం.

– ఐ.సురేష్‌, ఎంపీడీఓ, చీపురుపల్లి

‘రియల్‌’గా మోసం..!1
1/2

‘రియల్‌’గా మోసం..!

‘రియల్‌’గా మోసం..!2
2/2

‘రియల్‌’గా మోసం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement