
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కురుపాం: కాటందొరవలస గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు... పూతికవలస గ్రామానికి చెందిన గొట్టాపు గౌరునాయుడు బైక్‌తో వెళ్తుండగా కాటందొరవలస గ్రామ సమీపంలో ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. 108కు స్థానికులు సమాచారం ఇచ్చినా ఎంతకీ రాకపోవడంతో స్థానికులు కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని మండ గ్రామానికి చెందిన కిల్లక మౌళి(45) శుక్రవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బైక్ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు క్షతగాత్రున్ని భద్రగిరి ఆసుపత్రికి తీసుకురాగా ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు శనివారం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేయడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు ఎల్విన్‌పేట ఎస్‌ఐ బి.శివప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడు మౌళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బొబ్బిలి: చత్తీస్‌ఘడ్‌లోని పాట్నాకు చెందిన ఓం ప్రకాష్‌యాదవ్(30) శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి రైలులో వస్తుండగా జారి పడిపోయి మృతి చెందినట్టు రైల్వే హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపారు. గుర్తు తెలియని రైలులో ఉదయం 4.15 గంటలకు ముందు జారి పడినట్టు భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించినట్టు తెలిపారు. జీఆర్‌పీ అవుట్ పోస్టు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం