
ప్రజాస్వామ్యం.. అపహాస్యం
–IIలో
● అక్షరంపై ఆంక్షలు.. సిగ్గు సిగ్గు!
● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసుల వేధింపులు ఆపాలి
పార్వతీపురం రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, పలువురు జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మేధావులు, ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల నాయకులు తప్పుబట్టారు. ప్రజల గొంతుకను వినిపిస్తున్న పత్రికల గొంతునొక్కే నిరంకుశ చర్యలపై మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, నకిలీ మద్యం కుంభకోణాన్ని ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చినందుకే ‘సాక్షి’పై కక్ష కట్టారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు. అక్షరానికి సంకెళ్లు వేసే దుశ్చర్యలను తక్షణమే విరమించుకోవాలని, జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కుంభకోణాలను, అక్రమాలను ఆధారాలతో సహా ప్రచురిస్తున్న పత్రికలపై ప్రభుత్వమే కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. వాస్తవాలను నిర్భయంగా రాస్తున్న సంపాదకులపై, పాత్రికేయులపై వేధింపులకు పాల్పడడం అంటే... భావప్రకటనా స్వేచ్ఛను బందీ చేయడమే. ప్రశ్నించే తత్వాన్ని, నిజాలను నిగ్గుతేల్చే మేధో స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ద్వారా ప్రభుత్వం విద్యార్థి లోకానికి ఏం సందేశం ఇస్తోంది? రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, నిజాన్ని నిర్బంధించాలనుకోవడం పాలకుల ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనం.
– బి.రవికుమార్,
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా అవినీతి, కుంభకోణాలను, అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికల గొంతు నొక్కాలని అధికారంలో ఉన్న ప్రభుత్వం చూడడం అత్యంత హేయమైన చర్య. ప్రభుత్వ నిర్వాకంతో అవస్థలు పడుతున్న ప్రజల గొంతుకగా నిలుస్తున్న పత్రికలపైనే ప్రభుత్వం కత్తిగట్టడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడి కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడే గొంతుకపై జరిగిన దాడి. అధికార పాలకుల నిరంకుశ ధోరణికి అద్దం పడుతోంది. ఏదైనా వార్తా కథనం వచ్చేటప్పుడు వాటికి వివరణ అయినా ఇవ్వాలి. లేదా ఖండిస్తున్నాం అని తెలియజేయాలి, అంతేకానీ పత్రిక గొంతు నొక్కేలా కేసులు బనాయించడం సమంజసం కాదు.
– పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ విధానాల్లోని లోపాలను, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న పత్రికలపై కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణం. ఇది కేవలం పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావించరాదు. ఇది సమస్యలపై ఎత్తిచూపే గొంతు నొక్కే కుట్ర. అక్షరానికి సంకెళ్లు వేయడం, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పోకడలకు పరాకాష్ట. ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించే ఈ చర్యలను కార్మిక లోకం తీవ్రంగా గర్హిస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణమే రద్దు చేయాలి.
– ఆర్‌వీఎస్ కుమార్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడం, వార్తలు రాసినందుకే సంపాదకులపై కేసులు బనాయించడం అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా రంగంపై ప్రభుత్వమే ఉక్కుపాదం మోపడం దారుణం. ఇది కేవలం ఒక పత్రికపై జరిగిన దాడి కాదు. ఇది యావత్ జర్నలిస్టు లోకాన్ని భయభ్రాంతులకు గురిచేసే కుట్ర. వాస్తవాలను వెలికితీసే ప్రతి కలాన్నీ విచ్ఛిన్నం చేసే దురాలోచన ఇది. భావప్రకటనా స్వేచ్ఛ అనే రాజ్యాంగ ప్రాథమిక హక్కును ఇంత నిర్లక్ష్యంగా కాలరాయడాన్ని సహించలేము. ఈ కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం.
– అల్లువాడ కిషోర్,
ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
●

ప్రజాస్వామ్యం.. అపహాస్యం

ప్రజాస్వామ్యం.. అపహాస్యం

ప్రజాస్వామ్యం.. అపహాస్యం

ప్రజాస్వామ్యం.. అపహాస్యం