
‘ఆది కర్మయోగి’ పురస్కారం
పార్వతీపురం రూరల్: ‘ఆది కర్మయోగి’ కార్యక్రమంలో జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టడం, ప్రత్యేక చొరవకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గిరిజన సంక్షేమం, సాధికారత, సమ్మిళిత అభివృద్ధిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ‘ఉత్తమ ప్రదర్శన అవార్డు’కు ఎంపికై ంది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో పాలన, విద్యా, ఆరోగ్య రంగాల బలోపేతం, పర్యావరణ పరిరక్షణ, పౌర సౌకర్యాల అభివృద్ధి వంటి రంగాల్లో జిల్లా యంత్రాంగం కనబరిచిన ఆదర్శప్రాయమైన పనితీరును కేంద్ర ప్రభు త్వం గుర్తించి ఈ పురస్కారాన్ని అందించింది.
ఫైర్ సిబ్బందిపై ఎస్పీ ఫైర్
● బాణ సంచా క్రయవిక్రయాలను
తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: బాణసంచా విక్రయాలు జరుగుతున్న ప్రదేశంలో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంపై ఎస్పీ దామోదర్ అగ్నిమాపక శాఖ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. నగరంలోని కె.ఎల్.పురం వద్ద తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణాలను ఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అగ్నిమాపక వాహనాలు లేకపోవడం చూసి అసహనం వ్యక్తంచేశారు. వన్‌టౌన్ సీఐకు చెప్పి అగ్నిమాపక శాఖ అధికారులతో రెండు ఫైరింజన్లను ఏర్పాటుచేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాణసంచా విక్రయాలు జరిపేందుకు తాత్కాలిక అనుమతులు పొందిన వ్యాపారులు గడువు కాలం ముగిసిన వెంటనే క్రయవిక్రయాలు నిలిపివేయాలన్నారు. మిగిలి పోయిన బాణసంచా నిల్వలను సురక్షితమైన గొడౌన్‌లలో భద్రపరుచుకోవాలన్నారు. షాపుల మధ్య విధిగా 15 మీటర్ల దూరం ఉండాలన్నారు. ఒకవేళ అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణ నివారణ చర్యల్లో భాగంగా షాపులవద్ద ఇసుక బస్తాలు, నీటి టబ్‌లు, ఫైర్ నియంత్రీకరణను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్‌జామ్ కాకుండా వెహికల్స్‌ను సుదూర ప్రాంతంలో పార్కింగ్ చేసేలా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించని పక్షంలో దుకాణదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఎస్పీ సౌమ్యలత, ఇన్‌చార్జి డీఎస్పీ గోవిందరావు, ఎస్‌బీ సీఐ లీలారావు, వన్‌టౌన్ సీఐ ఆర్‌వీకే చౌదరి, టుటౌన్ సీఐ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సూరినా యుడు ఉన్నారు.
బాడంగి: స్థానిక హైస్కూల్ ఆవరణలోని కేజీబీవీ–4 టైప్ బాలికల వసతిగృహానికి అవసరమైన సిబ్బందిని త్వరలో నియమించి అందుబాటులోకి తెస్తామని ఈడీఓ మాణిక్యాలనాయుడు సమాచారం ఇచ్చారని హెచ్‌ఎం డి.సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 16వ తేదీన ‘ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీఈఓ స్పందించారన్నారు. హాస్టల్‌లో చేరిన బాలికలతో త్వరలోనే వసతి కల్పిస్తామని చెప్పారన్నారు.
దీపావళిది ప్రత్యేక స్థానం
విజయనగరం అర్బన్: దీపావళికి.. వెలుగుల పండగగా చెడుపై మేలును ప్రతిబింబించే మహోత్సవంగా దేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండగ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఇంటిలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టపాసులు కాల్చే సందర్భంలో పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలని కోరారు. ఈ దీపావళి ప్రతి కుటుంబానికి కొత్త ఆశలు, వెలుగులు, విజయాలు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
దీపావళి పండగ సందర్భంగా ఈ నెల 20న సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. తదుపరి వారం నుంచి పీజీఆర్‌ఎస్ యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈ వారం పీజీఆర్‌ఎస్ రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి వ్యయప్రయాసలకు ఓర్చి కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

‘ఆది కర్మయోగి’ పురస్కారం