
గంజాయి కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 2022 లో నమోదైన గంజాయి కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన ముద్దాయి (ఎ1) ఆకాష్ ఖూడా (22)కు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో 2022 సెప్టెంబర్ 19 వ తేదీన ఒక లాడ్జిలో ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. మూడేళ్ల తర్వాత కోర్టు విచారణలో నిందితుడు ఆకాష్ ఖూడా (22)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.లక్ష జరిమానా విధించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులపై నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగ్ లో ఉన్నాయని ఎస్పీ తెలియజేశారు.