
దివ్యాంగ ఉద్యోగిని చూసి చలించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎంప్లాయీస్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో ఒక దివ్యాంగ యువతిని చూసి ఆత్మీయంగా పలకరించి, ఆమె సమస్యను తెలుసుకున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన తానవరపు రూపశ్రీ దివ్యాంగురాలు. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఎంపిక కాగా కురుపాం మండలానికి పోస్టు కేటాయించారు. దూరప్రాంతం కావడంతో తన శారీరక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఆమె కలెక్టర్‌కు వివరించింది. ఆమె బాధ విన్న కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి మానవత్వంతో స్పందించి మాట్లాడుతూ నీ సమస్యను ప్రభుత్వానికి పంపించి మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మొత్తం 27 ఫిర్యాదులు అందగా గత నెలలో వచ్చిన 40 ఫిర్యాదులలో ఎక్కువ శాతం పరిష్కారమయ్యాయని కలెక్టర్ తెలిపారు. ట్రెజరీ, డ్వామా, ఈపీడీసీఎల్, మెడికల్ వంటి విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్‌శ్రీనివాసమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సానుభూతితో సమస్య పరిష్కారానికి హామీ