
ఖైదీలపట్ల వివక్ష కూడదు
● జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ
కార్యదర్శి కృష్ణ ప్రసాద్
విజయనగరం ఫోర్ట్: ఖైదీల పట్ల సిబ్బందిగాని, తోటి ఖైదీలు గాని వివక్ష చూపకూడదని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక సబ్‌జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఖైదీల పట్ల వివక్ష చూపిన ఎడల కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని కోరారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్తవ్యమని తెలిపారు. జైల్లో ఉన్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను తనిఖీ చేశారు. అనంతరం జువైనల్ జస్టిస్ హోమ్‌ను సందర్శించి అక్కడ ఉన్న ప్యానల్ న్యాయవాదులతో బాల నేరస్తుల పట్ల నమోదు చేస్తున్న కేసులను వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత వన్‌స్టాప్ సెంటర్‌ను పరిశీలించి సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వన్‌స్టాప్ సెంటర్ పోలీస్ అధికారి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.