
డివైడర్‌ను ఢీకొని విద్యార్థి మృతి
విశాఖపట్నం: స్థానిక బీఆర్‌టీఎస్ రోడ్డు మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని విజయనగరానికి చెందిన చిలకలపల్లి విశాల్ (21)గా గుర్తించారు. విశాల్ గీతం విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ పెందుర్తి ప్రాంతంలోని పురుషోత్తమపురంలో తన మామయ్య ఇంట్లో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. గురువారం సాయంత్రం విశాల్ తన స్నేహితుడు సూర్యతో కలిసి కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి హనుమంతవాక మీదుగా బీఆర్‌టీఎస్ రోడ్డులో వెళ్తున్న క్రమంలో.. శ్రీకృష్ణాపురం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన విశాల్ గుండెకు తీవ్ర గాయం తగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. సూర్యకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విశాల్‌ను స్థానికులు.. ఆరిలోవ పోలీసుల సహాయంతో విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.