
విద్యార్థుల ఆరోగ్య బాధ్యత గురువులదే
పార్వతీపురం రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఉపాధ్యాయులదేనని, అనారోగ్యంతో వసతిగృహాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో అడుగుపెట్టేంతవరకు అన్నీతామై వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వసతిగృహ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. బాలికల్లో హిమోగ్లోబిన్ 10 శాతం కంటే తగ్గకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు లేని వసతిగృహాల వివరాలు అందిస్తే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల నుంచి మంజూరు చేయిస్తామని చెప్పారు. ఈఎంఆర్‌ఎస్, గురుకులాల్లో తాగునీరు, ప్రహరీల, కిటికీలకు మెస్‌లు వంటి పనులకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎ.విజయశాంతి, ఉప వైద్యాధికారి కె.ఎస్.పద్మావతి పాల్గొన్నారు.
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: రుణాల మంజూరుతోపాటు రికవరీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాల రికవరీ సక్రమంగా ఉంటేనే మరిన్ని రుణాలు మంజూరుకు బ్యాంకులకు అవకాశముంటుందని చెప్పారు. పీఎంఈజీపీ, పీఎంవిశ్వకర్మ, ముద్ర, నాబార్డు రుణాల మంజూరుపై సమీక్షించారు.