
టిడ్కో గృహాల పరిశీలన
సాలూరు: పట్టణంలోని టిడ్కో గృహాలను హౌసింగ్ పీడీ డా.ధర్మచంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. టిడ్కో గృహాల నిర్మాణాల ప్రగ తి, అక్కడ వసతులు, సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
సాలూరు రూరల్: మండలంలోని బొడ్డవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ్రమపాఠశాల విద్యార్థులు నాలుగురోజుల క్రితం పచ్చకామెర్లతో విశాఖలోని కేజీహెచ్‌లో చేరారు. ఈ మేర కు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరా ల ప్రకారం దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వై.ఆకాష్ (9వతరగతి) కె.భార్గవ రావు(8వ తరగతి), జె.పార్థసారథి(8వ తరగతి) కె.సాత్విక్ (6వ తరగతి) సెలవులు ముగిసినా హాస్టల్‌కు రాకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులను సంప్రదించారు. దీంతో వారు సమాధానమిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పడంతో పాఠశాల ఉపాధ్యాయుడు యూసఫ్ పిల్లల ఆరోగ్య పరి స్థితిని తెలుసుకునేందుకు కేజీహెచ్‌కు వెళ్లారు. ప్రస్తుతం విధ్యార్థుల ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందని పాఠవాల ప్రిన్సిపాల్ పి.మూర్తి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు విశాఖపట్నంలో పనులు చేసుకుంటుండడంతో సెలవులకు వెళ్లిన విద్యార్థులు కేజీహెచ్‌లో చేరినట్లు తెలిపారు.
పాచిపెంట: రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణులను, అస్వస్థతకు గురైన బాలింతలను, ఇలా ఏ రోగం వచ్చినా ఆస్పత్రి కి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడంలేదని గిరిజనులు వాపోతున్నారు. పాచిపెంట మండలంలోని కేరంగి పంచాయతీ కోదులమడ గ్రామానికి చెందిన చోడిపల్లి పూలో అనే గిరిజన వద్ధుడు అనారో గ్యంతో గురువారం త్రీవ్ర అస్వస్థతకు గురయ్యాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కుటుంబసభ్యులు డోలీలో సుమారు 5 కిలోమీటర్ల దూరం నందేడవలస వరకు మోసుకువెళ్లి అక్కడినుంచి ఫీడర్ అంబులెన్స్‌లో గురువునాయుడుపేట పీహెచ్‌సీకి తరలించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తమకు డోలీలే శరణ్యమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దలు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని స్థానిక సర్పంచ్ సోములు లచ్చయ్య కోరారు.
బొబ్బిలి: దైవానుగ్రహంతోనే లోక కల్యాణం సాధ్యమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జియర్, బృందావన రామానుజ జియర్‌లు అన్నారు. బొబ్బిలి కంచర వీధిలోని కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ప్రవచనాలు, మంగళా శాసనాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక పురోహితులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి వనంగుడి హుండీల ఆదాయాన్ని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయ ఆవరణలో గురువారం లెక్కించారు. 42 రోజులకు రూ.12లక్షల 52వేల 606 నగదు లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. రామతీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో సాగిన ఆదాయం లెక్కింపులో ధర్మకర్తల మండలి సభ్యులు పద్మావతి, కుమారి, తామేశ్వరరావు పాల్గొన్నారు.