
పర్యాటక ప్రాంతాలుగా సహజ సిద్ధ జలపాతాలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో ఉన్న సహజ సిద్ధ జలపాతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ గ్రామ సమీపంలో గల మొగనాళి జలపాతాన్ని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిలతో కలిసి పర్యాటకుల సందర్శనార్థం కలెక్టర్ గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన టీ/ కాఫీ స్టాట్, ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌ను ప్రారంభించారు. జలపాతానికి పూజలు చేసి హారతి ఇచ్చారు. అలాగే జలపాతం సందర్శనకు కేటాయించిన తొలి టికెట్‌ను కలెక్టర్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా త్వరలో అడ్వెంచర్ స్పోర్ట్స్, క్‌లైంబింగ్ రాక్‌ను ఏర్పాటు చేస్తామని, ఈత కొట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఇలాంటి జలపాతాలు అనేకం ఉన్నాయని, వాటనన్నింటినీ అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తద్వారా స్థానిక యువత, ఎస్‌హెచ్‌జీ మెంబర్లకు ఉపాధి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాడికొండ గ్రామానికి వచ్చి మొగనాళి గెడ్డ జలపాతానికి వెళ్లాలనుకునే వారిని అక్కడికి చేర్చేందుకు మళ్లీ తీసుకువచ్చేందుకు సాధారణ ఖర్చులతో బైకర్స్‌ను కూడా గుర్తించామని, జిల్లా వెబ్‌సైట్‌లో ఈ బైకర్స్ వివరాలన్నీ ఉంటాయన్నారు. ఎవరికీ ఇబ్బంది వచ్చినా కాల్ చేసేందుకు వీలుగా ఒక టూరిజం కంట్రోల్ పాయింట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈఓ బి.చంద్రశేఖర్, వెలుగు ఏపీఎం సతీష్, ఏఎంసీ చైర్మన్ కె.కళావతి, తాడికొండ సర్పంచ్ ఎం.జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.