
మద్యంమత్తులో పోలీస్ స్టేషన్‌పై దాడి
● 17 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో శాంతిభద్రతలకు పూర్తిగా విఘాతం కలిగించేలా కొందరు ఆకతాయిలు మద్యం మత్తులో విధ్వంసం సృష్టించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్‌స్టేషన్‌పైనే ఆకతాయిలు మద్యం మత్తులో దాడికి తెగబడడం, విధుల్లో ఉన్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం, పోలీస్ సిబ్బంది కాలర్ పట్టుకుని, కత్తులతో బెదిరించే స్థాయికి చిల్లర మూకలు చెలరేగిపోయాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
ఘర్షణతో మొదలై..ఫిర్యాదుకు వచ్చి..విధ్వంసం..
పార్వతీపురం పట్టణంలో మంగళవారం రాత్రి దేశాలమ్మ తల్లి వారాల పండగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇందిరా కాలనీ, లింగం వీధికి చెందిన యువకుల మధ్య ఘర్షణ, కొట్లాట తలెత్తాయి. ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లింగం వీధి వాసులు ప్రయత్నించారు. అయితే, అత్యవసర సేవలకు కేటాయించిన ‘డయల్ 100’కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవకపోవడంతో మద్యం మత్తులో ఉన్న కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల నుంచి స్పందన లేదని ఆరోపిస్తూ, అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగం వీధికి చెందిన కొందరు స్థానికులు, యువకులు మద్యం మత్తులో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు, ఆవేశంతో ఊగిపోతూ స్టేషన్ గేట్లను బలంగా తన్నారు. విధుల్లో ఉన్న సెంట్రీ సిబ్బందిని దుర్భాషలాడుతూ, వారిపైకి దూసుకెళ్లారు. స్టేషనన్‌లోని కంప్యూటర్ టేబుల్‌పై ఉన్న అద్దాన్ని ముక్కలు చేసి విధ్వంసం సృష్టించారు. అంతటితో ఆగకుండా, విధి నిర్వహణలో ఉన్న ఒక సిబ్బంది కాలర్ పట్టుకుని లాగి, రైటర్ కుర్చీలో కూర్చుని వీరంగం సృష్టించారు. వారిలో ఒక యువకుడు ఏకంగా కత్తిని చేతబట్టి స్టేషన్‌లోని సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పట్టణ పోలీసులు, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని, 17 మందిపై కేసు నమోదు చేశారు. ’డయల్ 100’ సేవలు అందుబాటులో లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే అయినప్పటికీ, దానిని సాకుగా చూపి ఏకంగా పోలీస్ స్టేషనన్‌పైనే దాడి చేయడం సమంజసం కాదని, లా అండ్ ఆర్డర్‌ను పటిష్టంగా అమలు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.