
వైద్యవిద్య వ్యాపారం కాదు!
విజయనగరం గంటస్తంభం: ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ బాధ్యతలు వదిలేసి వైద్యవిద్యా వ్యవస్థను వ్యాపారుల చేతుల్లోకి నెట్టొద్దని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు బుధవారం జెడ్పీ మినిస్టీరియల్ భవనంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు యూ.ఎస్. రవికుమార్ అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధులు, వైద్యులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైద్య రంగాన్ని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థులకు, ప్రజారోగ్యానికి భారీ దెబ్బ పడుతుందని పేర్కొన్నారు. వైద్యవిద్య ఫీజులు ఆకాశాన్నంటుతాయని, పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే కల దూరమవుతుందని, రిజర్వేషన్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని విమర్మించారు. గ్రామీణ పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కార్యక్రమంలో రెడ్డి శంకరరావు, నాగమనోహర్, ఫైజల్, సురేష్ బాబు, రాజగోపాల్, వెంకటరావు, దివాకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.