
ఆర్టీసీ ఈడీ దృష్టికి ఉద్యోగుల సమస్యలు
విజయనగరం అర్బన్: ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి దృష్టికి విజయనగరం జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ కమిటీ తీసుకెళ్లింది. ఈ మేరకు బుధవారం సంఘం ప్రతినిధులు స్థానిక జోనల్ ట్రైనింగ్ కాలేజీ సమావేశ మందిరంలో ఆయనను కలిసి తమ సమస్యల పత్రాన్ని అందజేశారు. జోన్ పరిధిలోని 6 జిల్లాలు, 19 డిపోలు, జోనల్ వర్క్‌షాప్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జోన్‌లో ప్రమోషన్లు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని, రన్నింగ్ టైమ్ తగినవిధంగా లేవని, రికవరీలు, రెస్ట్ రూమ్‌లు, డ్యూటీ చార్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో నివాస గృహాల అద్దె సమస్య, టీమ్ రికవరీలు, రెస్ట్ రూమ్‌లు, డ్యూటీ చార్డులు వంటి పలు సమస్యలు ఉన్నాయిని వినతిపత్రంలో తెలియజేశారు. కొన్ని జిల్లాల్లో అక్రమంగా ఇస్తున్న ఓడీలు, ఉద్యోగుల సీనియార్టీలో తేడాలు, రూట్ సర్వేలు, మంచినీటి సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లభించకపోవడం వంటి 30కు పైగా సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఈడీని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి వెంకటరావు, జోనల్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జోనల్ కార్యదర్శి బీకేమూర్తి, జోనల్ కోశాధికారి కేఎస్‌ఎస్‌మూర్తి, జిల్లా కార్యదర్శి రవికాంత్ ఉన్నారు.