
గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
గంట్యాడ: మండలంలోని చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య ఉన్న గెడ్డలో కొట్టుకుపోయిన ఆర్.వసంత గ్రామానికి చెందిన విజ్జపు సోమరాజు(54) మృతదేహం బుధవారం లభ్యమైంది. విజయనగరంలోని పీడబ్ల్యూ మార్కెట్‌లో కిరాణా హోల్‌సేల్ దుకాణంలో విధులు ముగించుకుని సోమవారం రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వసంత గ్రామానికి సోమరాజు వెళ్తుండగా చంద్రంపేట దాటిన తర్వాత గెడ్డ దాటుతూ కొట్టుకుపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రప్పించి మంగళవారం గాలింపు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా అచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గెడ్డలో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

గెడ్డలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం