
ఎక్కడ?
న్యూస్‌రీల్
మంత్రి ఇలాకాలో
మరణ మృదంగం
మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: కొద్ది రోజుల కిందట తమ బడిని మరోచోటకు తరలించవద్దని.. తల్లిదండ్రులతో కలసి కొంతమంది పిల్లలు పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌కు వచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి, అధికారులకు మొర పెట్టుకుని, ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. దురదృష్టవశాత్తు నర్సిపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీన్ని రాజకీయం చేస్తూ, వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఓ టీడీపీ కార్యకర్త.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో వెంటనే ఆయన.. సదరు వ్యక్తి ఆరోపణలను సమర్దిస్తూ, పిల్లలతో రాజకీయం చేయడమేమిటని.. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ట్వీట్ చేశారు. విద్యార్థుల పట్ల విద్యాశాఖ మంత్రిగా ఆ సమయంలో లోకేశ్ స్పందించవచ్చు. ఇప్పుడు కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు పచ్చకామెర్లతో మృతి చెందారు. 180 మందికిపైగా వ్యాధి బారిన పడి, జిల్లా ఆస్పత్రిలోనూ, విశాఖ కేజీహెచ్‌లోనూ చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన లేదు. విశాఖ వచ్చినా.. కేజీహెచ్‌కు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన దాఖలాలు లేవు. విద్యార్థులు అనారోగ్యం పాలైన పది రోజుల తర్వాత గానీ.. స్వయాన జిల్లాకు చెందిన గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గానీ.. ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుగానీ పిల్లలను పర్యామర్శించిన పరిస్థితి లేదు. విద్యార్థులను పరామర్శించడానికి వస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాడ.. ఇప్పటి వరకూ కానరాలేదు. ఇదీ.. కూటమి ప్రభుత్వానికి గిరిజన విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ప్రజా, విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి.
మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా, గిరిజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు పాలకులు, అధికారులు విలువ ఇవ్వాలని... విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులకు కష్టమొస్తే.. గిరిజన ఆడబిడ్డగా మంత్రి సంధ్యారాణి స్పందించడం ఇలానేనా? అని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రెండో రోజు రిలే నిరాహారదీక్షలల్లో గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వారణాశి శ్రీహరి, చుక్క చంద్రరావు, ఏపీ రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి ఇ.వి.నాయిడు, కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం మండలాధ్యక్షుడు టి.గౌరీశంకర్ రావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, గిరిజన సంక్షేమ నిరుద్యోగ సంక్షేమ సంఘం నాయకులు అల్లు చందు, గౌరీశ్వరీ, రజిని, అమల, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మరో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. అనారోగ్యంతో సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మొత్తం 14 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇందులో గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గంలోనే మరణించిన విద్యార్థుల సంఖ్య మూడుకు చేరడం గమనార్హం. ఇప్పటికే నియోజకవర్గంలో మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతున్నా.. కూటమి ప్రభుత్వం మానవతాదృక్పథంతోనైనా స్పందించిన దాఖలాలు లేవు. కురుపాం ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటననూ చిన్నదిగా చూపించేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమని స్వయంగా ఆ శాఖ మంత్రి సంధ్యారాణి చెప్పడం గమనార్హం. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ.. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గానీ ఇప్పటి వరకూ దీనిపై సమీక్ష కూడా చేయకపోవడం గమనార్హం. విద్యార్థులు వ్యాధి బారిన పడటానికి గల కారణాలు సైతం ఇప్పటి వరకూ బయట పెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు గిరిజన విద్యార్థులు మరణించినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.. కనీసం వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదు.
మానవతాదృక్పథంతోనైనా స్పందించని కూటమి ప్రభుత్వం
నాడు విద్యార్థులకు ఆటో ప్రమాదం జరిగితే రాజకీయంగా ట్వీట్ చేసిన మంత్రి లోకేశ్
నేడు ఇద్దరు పిల్లలు మృతి చెంది, వందలమంది ఆస్పత్రి పాలైనా కనీస ప్రకటన శూన్యం
గిరిజన బాలల మృతిపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ
విద్యార్థుల మృతిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పరిగణించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణం స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మరోవైపు గిరిజన విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి ఆ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. కురుపాం గురుకుల పాఠశాలే కాకుండా పక్కనే ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆర్టికల్ 21(మానవ హక్కుల ఉల్లంఘన) కింద ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం దిల్లీలో కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్‌ను కలిసి కురుపాం బాలికల పాఠశాలలో కలుషిత నీటి ఘటనను వివరించారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యకూ ఈ ఘటనను వివరించారు. గిరిజన బాలలకు న్యాయం జరిగేలా అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ జి.మాధవి, జీసీసీ మాజీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు దిల్లీకి వెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్‌సింగ్ ఆర్య సైతం చలించిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు.

ఎక్కడ?

ఎక్కడ?