
విద్యార్థులే దేశానికి బలమైన పునాది
● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను విద్యావంతులుగానే కాకుండా, దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్ ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం విద్య, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడాతూ విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు మంచి చెడుల విచక్షణ, నైతిక విలువలు నేర్పించడం ద్వారా బలమైన తరాన్ని నిర్మించవచ్చన్నారు. విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ముస్తాబు కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా పిల్లల కోసం అద్దం, దువ్వెన, సబ్బు, టవల్ వంటివి ఏర్పాటు చేసి వారిని నిత్యం శుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఈఓ రాజ్ కుమార్ , ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఎక్కడ ‘బాబూ’?
విజయనగరం గంటస్తంభం: నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్మి పరుచూరి రాజేంద్రబాబు అన్నారు. విజయనగరంలోని డీఎన్‌ఆర్ అమర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 నెలలు కూటమి పాలనలో నిరుద్యోగ భృతి గల్లంతయ్యిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వలంటీర్లు, రేషన్ సిబ్బందిని తొలగించారని విమర్శించారు. రాష్ట్రంలో 1.56 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా, విజయనగరం జిల్లాలోనే 4.68 లక్షల మంది ఉన్నారన్నారు. నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించకుండా కార్పొరేట్‌లకు సీఈఓలా ఉన్నారని విమర్శించారు. వైద్య కళాశాలలు, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించడం అన్యాయమన్నారు. నవంబర్ చివరి వారం నుంచి హిందూపురం–ఇచ్ఛా పురం వరకు నిరుద్యోగుల ఆవేదన యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి కోన శ్రీనివాసరావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, జిల్లా నాయకులు వాసు, అప్పన్న, కిరణ్, గోపినాయుడు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.

విద్యార్థులే దేశానికి బలమైన పునాది