
చంద్రబాబు చేసింది శూన్యం
చీపురుపల్లి(గరివిడి): రాష్ట్ర భవిష్యత్, ప్రజల ప్రయోజనాల కోసం సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబునాయుడు చేసింది శూన్యమని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేసినది దివంగత మహానేత వైఎస్సార్ తరువాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. గరివిడిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మించాలని, పేదలకు మెరుగైన వైద్యం, పేదలకు వైద్యవిద్య అందుబాటులోకి రావాలని 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే అప్పటికే ఎన్‌డీఏ కూటమిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కనీసం పట్టించుకోలేదన్నారు. 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి సవాల్ విసిరిందన్నారు. అయినప్పటికీ కరోనా బారి నుంచి ప్రజలను రక్షించి, మరణాలు రేటు తగ్గించడంలో జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన దోహదపడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల మంజూరుకు కృషిచేశారన్నారు. కేవలం మూడేళ్లలోనే 5 కళాశాలల నిర్మాణాలు పూర్తిచేశారన్నారు. వీటి కోసం రూ.8 వేల కోట్లు అవసరం కాగా రూ.2,200 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్ల కాలంలో 17 వైద్య కళాశాలలు మంజూరు చేయడం సాధ్యమైతే 2014లో విభజన సమయంలో రాష్ట్రానికి మంజూరైన ఎయిమ్స్ కళాశాల ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. 2014లో రూ.1.19 వేల కోట్లతో డిజైన్ చేసిన అమరావతి 2019 వరకు ఎంత మేర పనులు జరిగాయని ప్రశ్నించారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూట మి ప్రభుత్వం 19 నెలలు కాలంలో రూ.2 లక్షలు కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పా లని డిమాండ్ చేశారు. వైద్యకళాశాల ప్రైవేటీ కరణకు నిరసనగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేద్దామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రూ.1.19 వేల కోట్లతో డిజైన్‌చేసిన అమరావతి ఎక్కడుంది?
2014లో మంజూరైన ఎయిమ్స్
కళాశాల పరిస్థితి ఏంటి?
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దారుణం
కోటి సంతకాలు సేకరించి
గవర్నర్‌కు అందజేద్దాం
శాసనమండలి విపక్షనేత
బొత్స సత్యనారాయణ

చంద్రబాబు చేసింది శూన్యం