
జిల్లాలో అభివృద్ధి శూన్యం..
● పూర్తికాని ప్రాజెక్ట్‌లు
● కానరాని అభివృద్ధి పనులు
● పట్టించుకోని కూటమి ప్రభుత్వం
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నో హామీలిచ్చినా నేటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. సాగునీటి ప్రాజెక్ట్‌ల ఊసే ఎత్తకపోవడంతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రెండుసార్లు వచ్చినా హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో చేసి చూపించలేకపోయారు.
జెకా నిధులపై నిర్లక్ష్యం...
2014 సంవత్సరం నుంచి జైకా నిధులపైనా నిర్లక్ష్యం కొనసాగుతోంది. వట్టిగెడ్డకు రూ.38 కోట్ల జైకా నిధులు విడుదలయ్యాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కోట్ల రూపాయల విలువైన పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వెంగళరాయ సాగర్‌కు రూ.64 కోట్లతో టెండర్లు ఆమోదించారు. ఈ పనులు కూడా మధ్యలో నిలిచిపోయాయి. అలాగే పెదంకలాం, ఆండ్ర ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
శిథిలావస్థలో నారాయణపురం ఆనకట్ట ..
సంతకవిటి మండలం రంగారాయపురం, శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం సమీపంలో నాగావళి నదిపై 1959 – 63 మధ్య నారాయణపురం ఆనకట్టను నిర్మించారు. సంతకవిటితో పాటు శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 38 వేల ఎకరాలకు ఈ ఆనకట్ట సాగునీరు అందిస్తూ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం కనబరచడంతో షట్టర్లు, రెగ్యులేటర్లు, స్పిల్‌వే వ్యవస్థలతో పాటు కాలువలు, గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటినా జిల్లాలో అభివృద్ధి రూపురేఖలు కనిపించడం లేదు. గిరిజన విశ్వవిద్యాలయం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయి. పతంజలి వంటి సంస్థల పరిశ్రమలు కూడా ఊసులకే పరిమితమయ్యాయి. అంతేకాదు, పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులను తొలగించడం, మౌలిక సదుపాయాల కేటాయింపులో జాప్యం వంటి చర్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
మూతబడిన ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ..
చెరకు రైతులకు అండగా నిలబడడంతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. ముడి సరుకు కొరత, విద్యుత్ చార్జీల పెరుగుదల, ప్రభుత్వ రాయితీలు కల్పించకపోవడం వంటి కారణాలతో ఫ్యాక్టరీని మూసి వేయాల్సి వచ్చింది.