
యజమానే మా కొడుకును చంపేశాడు..
● మృతుడు యలకల రాము
తల్లిదండ్రులు
చీపురుపల్లి: తండ్రిలా చూసుకోవాల్సిన యజమానే తమ కొడుకును కిరాతకంగా హత్య చేసాడని మండలంలోని పత్తికాయవలస గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన యలకల రాము తల్లిదండ్రులు సింహాచలం, రమేష్ ఆరోపించారు. తమ కుమారుడిని యజమానే హత్య చేసాడని ఆలస్యంగా తెలుసుకున్న వారు సోమవారం ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మృతుని తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు నాలుగు సంవత్సరాలుగా తమ గ్రామానికి చెందిన వండాన సన్యాసి వద్ద జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. అయితే సకాలంలో జీతాలు కూడా ఇచ్చేవాడు కాదని.. అయినప్పటికీ ఒకే ఊరు కావడంతో ఆయన వద్దనే పని చేస్తుండేవాడని తెలిపారు. ఈ నెల 8న ఇంటి నుంచి విధులకు వెళ్లిన తమ కొడుకు రాము తిరిగి ఇంటికి చేరుకోలేదన్నారు. ఫోన్ చేసినా అవ్వకపోవడంతో యజమాని సన్యాసికి ఫోన్ చేసి చెప్పగా.. అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిపోయాడని తెలిపాడని చెప్పారు. మరుచటి రోజు యజమాని సన్యాసి గ్రామంలో వేరేవారికి ఫోన్ చేసి రాము అలిగి వెళ్లిపోయాడని.. పదో తేదీన మరి కొంతమందితో భోగాపురం విమానాశ్రయం పనికి వెళ్లిపోయాడని పొంతన లేని సమాధానాలు చెప్పాడన్నారు. ఇంతలో 11వ తేదీన పుర్రేయవలస ఇటుక బట్టీల వద్ద ఉన్న బావిలో తమ కుమారుడు శవమై కనిపించాడని కన్నీరుమున్నీరయ్యారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే సన్యాసి తమ కుమారుడ్ని హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని శిక్షించాలని కోరారు.