
ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!
మా పిల్లల పరిస్థితి ఏమిటి?
● ఇదెక్కడి తీరు ‘నాయనా’..! ● విద్యార్థులకు అక్కరకు రాని హాస్టల్ భవనం ● ఇంటివద్ద నుంచే రాకపోకలు
బాడంగి: విద్యార్థుల వసతి కోసం హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. దానిని ఇప్పటిరకు అందుబాటులోకి తేలేదు. విద్యార్థులకు వసతి కల్పించలేదు. ఫలితం.. భవనం ప్రారంభించినా ఫలితం లేకపోతోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదెక్క తీరు ‘నాయనా’ అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే...
బాడంగి హైస్కూల్‌కు అనుబంధంగా కేజీబీ టైప్–4 హాస్టల్ నూతన భవనాన్ని హడావిడిగా సెప్టెంబర్ 9న ఎమ్మెల్యే బేబీ నాయన చేతులమీదుగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఆ భవనం నిర్వహణకు నోచుకోలేదు. వసతి సదుపాయం ఉంటుందన్న ఆశతో సాలూరు, పాచిపెంట తదితర దూరప్రాంతాలనుంచి హైస్కుల్‌లో చేరిన బాలికల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఇక్కడకు వచ్చి ఉండేందుకు వసతిలేక ఇంటివద్దనే ఉండిపోతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇదే విషయంపై బాడంగి హైస్కూల్ హెచ్‌ఎం సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా వార్డెన్, ట్యూటర్‌ను ఇచ్చారని, ఇంకా వంటమనిషి, వాచ్‌మన్, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లను నియమించాల్సి ఉందన్నారు. సిబ్బంది నియామకం అయితే వసతిగృహం అందుబాటులోకి వస్తుందన్నారు.
హాస్టల్ సౌకర్యం ఉంటుందని మా పిల్లల్ని జె డ్పీ హైస్కూల్‌లో చేర్పించాం. జూన్ నెల నుంచి నాలుగునెలుగా చదువుకు దూరంగా గడుపుతున్నారు. ఇలా అయితే పదోతరగతిలో ఉత్తీర్ణులు ఎలా అవుతారు. త్వరితగతిన వసతిగృహాన్ని ప్రారంభించాలి.
– గొర్కాకుమారి, దళాయి సత్యవతి,
బాలికల తల్లులు, సాలూరు

ఆ హాస్టల్ ప్రారంభానికే పరిమితం..!