
ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!
రైతు కంటే వ్యాపారులకే లాభం
ఏటా వ్యవసాయం చేసే రైతు కంటే పంటను కొనుగోలు చేసే వ్యాపారులే లాభం పొందుతున్నారు. సాగులో ఎదురయ్యే కష్టనష్టాలతో పాటు మార్కెట్‌లో ఏర్పడే ఒడుదుడుకులన్నింటినీ భరించేది అన్నదాతలే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో దళారులకే తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తోంది.
– వావిలపల్లి హరిబాబు, రైతు,
దశుమంతపురం, వీరఘట్టం మండలం
ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ వరి సాగు
1.75 లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా
3.58 లక్షల మెట్రిక్ టన్నులు
వీరఘట్టం: ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. పంట చేతికందే సమయంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తోంది. మద్దతు ధర అందకుండా చేస్తోంది. పరోక్షంగా వ్యాపారులకు పంటను దోచిపెట్టేలా వ్యవహరిస్తూ రైతన్నకు నష్టాన్ని మిగుల్చుతోంది.
ధాన్యం సీజన్ ఆరంభమైనా...
జిల్లాలోని ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి జలాశయంతో పాటు, వెంగళరాయసాగర్, వట్టి గెడ్డ, పెద్దగెడ్డ, జంఝావతి, పెదంకలాం ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు వర్షాధార భూములు 1,75,065 ఎకరాల్లో రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిపంటను సాగుచేశారు. 3.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అధికశాతం మంది రైతులు తక్కువ కాలవ్యవధిలో దిగుబడి వచ్చే సన్నరకాలు సాగుచేశారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. యంత్రాలతో కోతలు, నూర్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఎకరాకు 28 నుంచి 30 బస్తాల (80 కిలోల బస్తాలు) వరకు దిగుబడి వస్తోంది. అయితే, ధాన్యం విక్రయిద్దామంటే జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకుంది. గతేడాది 80 కిలోల ధాన్యంను రూ.1550 నుంచి రూ.1600కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు రూ.1390కు కొనుగోలు చేస్తున్నారు. తూకంలో కూడా ఐదు కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో పలుచోట్ల వరి కోతలు ప్రారంభం
ఎకరాకు 28–30 బస్తాల దిగుబడి
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని ప్రభుత్వం
ఇదే అదునుగా ధర తగ్గించేసిన
వ్యాపారులు
గతేడాది ఖరీఫ్‌లో బస్తాకు రూ.1550 పలికిన ధర
నేడు రూ.1390లు మాత్రమే
చెల్లింపు

ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!

ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!

ధాన్యం రైతుకు ‘మద్దతు’ కరువు..!