
గిరిజన సంక్షేమశాఖ మంత్రి రాజీనామా చేయాలి
పార్వతీపురం: వరుసగా అనారోగ్యంతో విద్యార్థులు మరణిస్తున్నా పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తక్షణమే రాజీనామా చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడారు. మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న తాడంగి చిన్నారిని బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఈనెల 13న సాలూరు ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరం, విశాఖ కేజిహెచ్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. అలాగే, సాలూరు మండల మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహం 7వ తరగతి చదువుతున్న తాడంగి పల్లవి ఈనెల 11న విశాఖపట్నం తరలించినప్పటికీ సెలిబ్రల్ మలేరియాతో మృతి చెందిందన్నారు. కురుపాంలో కలుషిత నీరు కారణంగా సుమారు 224 మంది విద్యార్థులు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచి వారికి కష్టమొస్తే పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తక్షణమే విద్యార్థుల మృతికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.