
తెర్లాం ఉపాధ్యాయుడికి గుర్తింపు
● వరించిన అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
తెర్లాం: అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తికాయల సునీల్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ (సోలిట్) ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా – అమెరికా సంయుక్త రాష్ట్రాలు విద్యా, సాంకేతికతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అంతర్జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి తెర్లాం హైస్కూల్‌లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు బోధిస్తున్న సునీల్‌కు అవార్డు వరించింది.ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కరరావు, అనువాద ఏఐ సీఈఓ డాక్టర్ బి.చంద్రశేఖర్, ప్రముఖ అంతర్జాతీయ క్యాన్సర్ రీసెర్చ్ నిపుణుడు డాక్టర్ జి.పూర్ణచంద్ర నాగరాజు, యూనివర్సిటీ ఆఫ్ అలబామా ఎట్ బర్మింగ్‌హామ్ (అమెరికా) చేతుల మీదుగా సునీల్ అవార్డు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా 80కి అవార్డులు రాగా.. అందులో ఒకరు జిల్లా వాసి కావడం గర్వకారణమని ఎంఈఓ త్రినాథరావు, తెర్లాం హైస్కూల్ హెచ్‌ఎం రమేష్, తదితరులు ప్రశంసించారు.