
గడువులోగా రీ సర్వే పూర్తి చేస్తాం..
● జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్
ఎ.డి లక్ష్మణరావు
సీతానగరం: జిల్లాలో జరుగుతున్న థర్డ్ ఫేజ్ రీ సర్వే పనులు 30 రోజుల్లో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్స్ ఏడీ పి. లక్ష్మణరావు అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం డీడీ, మూడు జిల్లాల ప్రత్యేక అధికారి కె. సూర్యనారాయణతో సమావేశమై రీ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఎ.డి లక్ష్మణరావు మాట్లాడుతూ.. థర్డ్ ఫేజ్ కింద 43 గ్రామాలకు గాను 27,380 ఎకరాల్లో రీ సర్వే చేయాలని నిర్ధారించామని, అందులో ప్రైవేట్ భూమి 18,788 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. విప్యూటీ డైరెక్టర్ కె. సూర్యనారాయణ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియ నిర్దేశిత సమయానికి పూర్తి చేసేలా అధికారులకు అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సర్వే పనులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, ఇందులో భాగంగానే ఇప్పలవలసలో చేపడుతున్న సర్వేను పరిశీలించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాగిరెడ్డి శ్రీనివాసరావు, మండల సర్వేయర్ చంద్రశేఖర్, స్థానిక సర్వేయర్లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.