
విద్య, ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి
గుమ్మలక్ష్మీపురం: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందివ్వడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఈమేరకు శనివారం ఆయన గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు, దొరజమ్ము, టిక్కబాయి గ్రామాల్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలతో పాటు రేగిడి, పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా పాఠశాలల్లోని తాగునీటిని, మరుగుదొడ్లు, స్నానపు గదులు, పాఠశాల ఆవరణ, వసతి గృహల ఆవరణను పరిశీలించారు. పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లును ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని, భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు ఉండేలా ఆకు, కూరగాయలు, గుడ్లను ఇవ్వాలని, అనారోగ్యానికి గురైనట్లు గుర్తించిన వెంటనే వైద్య సదుపాయాలు కల్పించాలని హెచ్‌ఎంలు, డిఫ్యూటీ వార్డెన్లకు సూచించారు. తన పర్యటనలో భాగంగా కురుపాంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను కూడా సందర్శించారు. ఆయన వెంట గుమ్మలక్ష్మీపురం ఎంఈఓ బి.చంద్రశేఖర్, తహసీల్దార్ ఎన్.శేఖర్ ఉన్నారు.