
ఫలితం ఉంటుందా?
సాక్షి, పార్వతీపురం మన్యం: కురుపాం గురుకుల సంక్షేమ బాలికల పాఠశాలలో పచ్చకామెర్ల కలకలం.. ఇద్దరు విద్యార్థుల మృతి ఘటన.. జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో లోపాలను మరోమారు ఎత్తిచూపింది. కొంతకాలంగా ఈ పాఠశాలల్లోనే విద్యార్థులు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నా... మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకుంటున్నా.. సరిదిద్దడంలో ఐటీడీఏ అధికారులు పూర్తి నిర్లక్ష్యం చూపారు. ఇప్పటికే చాలా నష్టం జరిగాక.. జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన వెంటనే కురుపాం పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఈ ప్రిన్సిపాల్ కూడా సుమారు నెలన్నర క్రితమే అక్కడ విధుల్లో చేరారు. అప్పటికే ఇక్కడ పచ్చకామెర్ల వ్యాధి కాచుకొని ఉంది. ఈ విషయంలో ఆమె తప్పులేకున్నా.. తొలుత యంత్రాంగం ప్రిన్సిపాల్‌ను బలిపశువును చేసింది. తాజాగా పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణిని విధుల నుంచి తప్పించారు. అసలు తొలి నుంచి కృష్ణవేణి నియామకంపైనే విమర్శలున్నాయి. కురుపాం నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి భార్య కావడంతోనే... సాలూరు సహాయ సంక్షేమాధికారిగా ఉంటున్న ఆమెకు అదనపు బాధ్యతలు
అప్పగించి.. డీడీ పోస్టులో కూర్చోబెట్టారని గిరిజన సంఘాలు గగ్గోలు పెట్టాయి. రెగ్యులర్ పీవో లేకపోవడం.. డీడీ సైతం ఇన్‌చార్జి కావడంతో గిరిజన సంక్షేమ విభాగం పూర్తిగా గాడి తప్పింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కింది. విద్యార్థుల సంక్షేమాన్ని మరిచారు. సౌకర్యాల కల్పనకు పాతరేశారు. కురుపాం ఘటన తర్వాత వేళ్లన్నీ ఐటీడీఏ వైపే చూపడంతో.. డీడీని అనివార్య పరిస్థితుల్లోనైనా తప్పించాల్సి వచ్చింది. ఆమెను తిరిగి సాలూరు సహాయ సంక్షేమాధికారిగా కొనసాగిస్తూ.. డీడీ బాధ్యతలను ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పని చేస్తున్న ఎ.విజయశాంతికి అప్పగించారు. ఇప్పుడు కూడా ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా.. పార్వతీపురం మన్యం జిల్లా ఎక్కడ.. అదనపు బాధ్యతలతో పూర్తి పర్యవేక్షణ సాధ్యమేనా? అని గిరిజన సంఘ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.