
ఆ హెచ్‌ఎం మాకొద్దు
వీరఘట్టం: తరచూ పాఠశాలకు డుమ్మాకొడుతూ.. పాఠ్యాంశాలు బోధించని ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామస్తులు నినదించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడు నాగరాజు శనివారం ఉదయం పాఠశాలకు వచ్చి 9.30 గంటలకు బయోమెట్రిక్ హాజరు వేసుకొని వెంటనే బయటకు వెళ్లిపోయారు. దీనిని గుర్తించిన స్కూల్ కమిటీ చైర్మన్ రవిప్రసాద్, కొందరు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి నాగరాజు మాస్టారు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. బయటకు వెళ్లి వస్తానని చెప్పారని చిన్నారులు సమాధానం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలు అయినా హెచ్‌ఎం పాఠశాలకు తిరిగి రాకపోవడంతో విద్యాశాఖాధికారులకు తెలియజేశారు. అనంతరం విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించేసి పాఠశాలకు తాళం వేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో వీర ఘట్టం వెళ్లి ఎంఈఓలు డి.గౌరినాయుడు, ఆర్.ఆనందరావుకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. హెచ్‌ఎం నాగరాజుతో పాటు మరో ఉపాధ్యాయుడు మోహన్‌కృష్ణ ఇక్కడ పనిచేస్తున్నారు. మోహన్‌కృష్ణ శుక్రవారం నుంచి సెలవులో ఉన్నారు. ఆ పరిస్థితిలో విధిగా హెచ్‌ఎం పాఠశాలలో ఉండాలి. అయితే, ఆనారోగ్యంగా ఉందని, సెలవు ఇచ్చి ఎవరినైనా పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపించాలని ఎంఈఓ గౌరినాయుడుకు ఫోన్‌లో హెచ్‌ఎం నాగరాజు కోరారు. దానికి ఎంఈఓ స్పందిస్తూ మధ్యాహ్నం 12 గంటల వరకు డ్యూటీ చేయాలని, తర్వాత పక్క గ్రామం నడిమికెల్ల స్కూల్ నుంచి డిప్యుటేషన్‌పై ఒక ఉపాధ్యాయుడిని పంపిస్తానని తెలిపారు. అయితే, నాగరాజు పాఠశాలకు వచ్చిన కొద్ది నిమషాలలోనే బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై నాగరాజు మాట్లాడుతూ దగ్గు ఎక్కువ కావడం, ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవడంతో శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్లాలని, విషయం ఎంఈఓకు తెలియజేశానని, సెలవు పత్రం కూడా పాఠశాలలో ఉంచినట్టు తెలిపారు. కావాలని వెళ్లిపోలేదన్నారు. తన పరిస్థితిని గ్రామస్తులు అర్థం చేసుకోవాలని కోరారు. ఇదే విషయంపై ఎంఈఓ గౌరినాయుడు మాట్లాడుతూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
కడకెల్ల హెచ్‌ఎం తీరుపై
గ్రామస్తుల ఆగ్రహం
పాఠశాలకు డుమ్మాకొడుతున్న
హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఈఓకు ఫిర్యాదు

ఆ హెచ్‌ఎం మాకొద్దు