
ఏకలవ్యలో కామెర్ల కలకలం
● ఆందోళనలో తల్లిదండ్రులు
కురుపాం:
కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పట్టిపీడిస్తున్న పచ్చకామెర్ల వ్యాధి ఇప్పుడు ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు పాకింది. వారిని ఆస్పత్రుల పాలచేసింది. సుమారు 30 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారినపడి పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నారు. వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ పిల్లలకు పచ్చకామెర్లా.. లేదంటే వైరల్ జ్వరాలో తెలియక పోవడం, వైద్య ఆరోగ్యశాఖ సరైన సమాచారం కూడా ఇవ్వక పోవడంతో ఆవేదన చెందుతున్నారు. కామెర్ల వ్యాధి ముదిరితే తమ పిల్లల పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో తరగతులు పునఃప్రారంభం కానున్న తరుణంలో గురుకులం, ఏకలవ్య పాఠశాలల్లో సమస్య పునరావృతం కాకుండా తాగునీరు, డ్రైనేజ్ వాటర్, మరుగుదొడ్ల నీరు వెళ్లే పైపులైన్స్‌ను మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ పిల్లలను పాఠశాలలకు పంపేదే లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు తేల్చిచెబుతున్నారు.
నా కొడుకు కామెర్లతో బాధపడుతున్నాడు
నా కొడుకు మండంగి గౌతం ఏకలవ్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. పచ్చకామెర్ల లక్షణాలు ఉండడంతో వైద్య సిబ్బంది కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల కోసం చేర్పించారు. కామెర్ల శాతం 2.75 పాయింట్స్ ఉన్నాయని తెలిపారు. చికిత్స అందిస్తున్నారు.
– మండంగి కుమారి, గుల్లలంక గిరిజన గ్రామం, జి.ఎల్.పురం మండలం

ఏకలవ్యలో కామెర్ల కలకలం