
బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
పార్వతీపురం: బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్లు మహిళా శిశుసంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ టి. కనకదుర్గ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో బాలికలకు సమానత్వం, భాగస్వామ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన, తదితర పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ అధికారి పి. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని పది ప్రాజెక్టు పరిధిలోని 350 సచివాలయాల పరిధిలో ప్రపంచ బాలల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలకొండ, సీతంపేట, భామిని, కురుపాం, భద్రగిరి ప్రాజెక్టుల పరిధిలోని పాఠశాలల్లో బాలికలకు వ్యాసరచన, స్పోర్ట్స్ తదితర పోటీలను నిర్వహించామన్నారు. బాలికలను రక్షిద్దాం–బాలికలకు చదివిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బాల్య వివాహాలను నివారించడం, లైంగిక దాడులను నివారించడం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.