
కందివలసలో గజగజ
కొమరాడ: మండలంలోని కందివలస గ్రామ పరిసరాల్లో గజరాజుల సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంటలు ధ్వంసం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మంగళవారం రాత్రి గ్రామంలోకి చొరబడడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎవరిపై దాడి చేస్తాయో అని భయాందోళన చెందారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవడంలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఉచిత వైద్యం
పార్వతీపురంటౌన్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న స్వస్థ్ నార్తీ స్వశక్తి పరివార్ అభియాన్ కింద జిల్లాలోని మహిళలందరికీ ఉచిత వైద్యసేవలు అందజేస్తున్నట్టు కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో బుధవారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అక్టోబర్ 2 వరకు నిర్వహించే వైద్యశిబిరాల్లో మహిళలకు ఉచిత వైద్యసేవలు అందజేస్తామని తెలిపారు. శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ ఎస్.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ఎస్.భాస్కరరావు, జి.నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్, రాష్ట్ర నోడల్ అధికారి డా.గీతాపద్మజ, మహిళా శిశు సంక్షేమ అధికారి టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
పట్టు జారిందా..
ప్రాణం గోవిందా..!
ఈ చిత్రం చూశారా... ఇటీవల కురిసిన వర్షాలకు అడారుగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మక్కువ మండలంలోని గుంటభద్ర గ్రామానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనారోగ్యానికి గురైన చొడిపల్లి శుక్రమ్మను వైద్యం కోసం గెడ్డదాటించలేకపోవడంతో ఆమె శనివారం ప్రాణాలు విడిచింది. చివరకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా గ్రామస్తులు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. గెడ్డలో కాస్త నీరు తగ్గడంతో బుధవారం ఇదిగో ఇలా గెడ్డకు ఇరువైపులా చెట్లకు అధికారులు కట్టిన తాడు సాయంతో గిరిజనులు దాటుతున్నారు. సీదరపు ప్రసాద్ అనే వ్యక్తి వరి పంటకు పురుగుమందులు జల్లుతుండగా పాముకాటేయడంతో డోలీలో గెడ్డ దాటించి శంబర ఆస్పత్రికి తరలించారు.
– మక్కువ

కందివలసలో గజగజ