
నాగావళి తీరంలో కొనసాగుతున్న వెతుకులాట
● తన తల్లే అంటున్న రాజాం పట్టణవాసి పైడిరాజు
పాలకొండ రూరల్: ఇటీవల నాలుగు రోజుల క్రితం పాలకొండ మండలం గొట్ట మంగళాపురం సమీపంలో గుర్తు తెలియని మహిళ వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేసింది. ఈ క్రమంలో అక్కడి స్థానికులు అందించిన సమాచారంతో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా పరిధిలో నదీతీర పరీవాహక మండలాల పోలీసులు మహిళను వెతుకులాడేందుకు దృష్టి పెట్టారు. పాలకొండ ఎస్సై కె.ప్రయోగమూర్తి, స్థానిక అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు, ఈతగాళ్లు తీరం వెంబడి ఉన్న చిన మంగళాపురం, బొడ్డవలస, యరకారాపురం, గోపాలపురం, అన్నవరం, డొంకలపర్త, కిలంతర, సంకిలి తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా మంగళవారం నాటికి కూడా ఎక్కడా మహిళ ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరింత క్షుణ్ణంగా పరిశీలన చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.
మా అమ్మే..!
ఇదిలా ఉండగా ఈ ఘటనలో నదిలో దూకిన మహిళకు సంబంఽధించి నిన్నటి వరకూ ఎటువంటి ఆచూకీ లభ్యం కాకపోగా కేవలం వంతెనపై పాదరక్షలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా రాజాం పట్టణ పరిధి మల్లయ్య పేటకు చెందిన కాకర్ల పైడిరాజు ఘటనాస్థలంలో అధికారులను ఆశ్రయించి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన తల్లి పార్వతి(54) ఈనెల 13న శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తెలిసినవారిని వాకబు చేశామని, ఎక్కడ ఉన్నది తెలియకపోవడంతో ఆదివారం ఉదయం రాజాం పోలీసులకు ఫిర్యాదు చేసి, అటుపై నదిలో మహిళ దూకిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చామన్నారు. అధికారులు గుర్తించిన పాదరక్షలు తన తల్లివేనని ధ్రువీకరించారు. దీర్ఘకాల అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న తన తల్లికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు వివరించారు. కేవలం భయంతో ఆమె పని చేసి ఉండవచ్చని కుమారుడు పైడిరాజు చెబుతున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు మాట్లాడుతూ మృతదేహం లభ్యమైతే తప్ప ఈ విషయాన్ని నిర్ధారణ చేయలేమన్నారు.

నాగావళి తీరంలో కొనసాగుతున్న వెతుకులాట