
మెడికల్ సీట్లు అమ్మకం సిగ్గుచేటు?
జియ్యమ్మవలస రూరల్: ఆదాయం కోసం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరంచేసి సీట్లు అమ్ముకోవడం సిగ్గుచేటని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. చినమేరంగిలో తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సామాన్య, పేద కుటుంబాల్లో విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న సదుద్దేశంతో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. అందులో ఐదు మెడికల్ కళాశాలల పనులు పూర్తి చేసి తరగతులు ప్రారంభించగా, మరో రెండు కళాశాలల్లో కూడా తరగతులు కొనసాగుతున్నాయన్నారు. ఇవి ప్రభుత్వానికి కనిపించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర హోం మంత్రి ఎప్పుడో తీసిన చిత్రాలను చూపించి మెడికల్ కళాశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉందని అబద్ధపు మాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ఘోర కృత్యాలు, లైంగిక వేధింపులపై స్పందించకుండా కళాశాలలపై అబద్ధపు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఆమెకు విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు, కడపలో ఉన్న ఏడు వైద్య కళాశాలలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇవి కూటమి నాయకులు చూపిస్తున్న అమరావతి గ్రాఫిక్ చిత్రం కాదని, ఇక్కడ కళాశాలలు ఉన్నా యా? లేదా?, తరగతులు జరుగుతున్నాయా? లేదా? అనేది ఒకసారి కళ్లుతెరచి చూస్తే కనిపిస్తాయన్నారు. మెడికల్ కళాశాలలో సీట్లు సంపాదించి చదివిన వారికి ఆ సీటు విలువేంటో తెలుస్తుందన్నారు. ఎంతో ముందు చూపుతో గత ప్రభుత్వం ఒక్కో వైద్య కళాశాలకు రూ.600 కోట్లు వెచ్చించి మంజూరు చేసిందన్నారు. ఆ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు క్యాబినెట్‌లో ఆమోదంచేశారంటే పేద, మద్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉసురు తప్పక తగులుందన్నారు. దీనిపై ఉద్యమం సాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను తానే తెచ్చానని చెబుతుంటే... అదే కేబినేట్‌లో మంత్రిగా ఉన్న పార్థసారథి గత ప్రభుత్వంలో 15 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని, 7 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని చెబుతున్నా ఇవేవీ బాబు చెవికి ఎక్కడం లేదని ఎద్దేవా చేశారు. 1923లో విశాఖలో కింగ్‌జార్జ్ ఆస్పత్రి ఏర్పాటుచేశారని, వందేళ్ల పైబడి సూపర్‌స్పెషాల్టీ సేవలు అందిస్తోందన్నారు. అదే మాదిరిగా పార్వతీపురంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి 90 శాతం ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్న జిల్లాకు ఒక సూపర్‌స్పెషాల్టీ మెడికల్ కళాశాలను మంజూరుచేసే అలోచన ఈ వందేళ్లలో ఏ ఒక్క నాయకుడికి లేదని, అది ఒక్క వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే చెల్లుతుందన్నారు. అలాంటి మెడికల్ కళాశాలలను నేడు ప్రైవేటీ కరణ చేస్తామంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. 2022లో జిల్లాల ఏర్పాటు సమయంలోనే పార్వతీపురానికి మెడికల్ కళాశాల మంజూరు చేసి ఉల్లిభద్ర వద్ద స్థల సేకరణ జరిగిన సంగతిని కూటమి నాయకులు గుర్తుచేసుకోవాలన్నారు. పేద, మద్య తరగతి కుటుంబాలు విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ఆ పాపాన్ని ఆపాదించుకోవద్దని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కోట రమేష్‌నాయుడు, లోలుగు నారాయణరావు, శెట్టి పద్మావతి, సుజాత, సింహాచలంనాయుడు, సత్యంనాయుడు, కళ్యాణ్, రామ కృష్ణ, ఎస్.కె.నిషాన్, తదితరులు పాల్గొన్నారు.
పీపీపీ విధానాన్ని రద్దుచేయకుంటే పోరాటం చేస్తాం
వైద్యవిద్యను అభ్యసించాలనుకునే పేదకుటుంబాల విద్యార్థులకు ద్రోహం చేయొద్దు
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి