
కూటమి తీరుపై గర్జించిన ఎర్రదండు
● ప్రజల సంపదను పెట్టుబడిదారులకు కట్టబెతున్నారు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాలకొండ: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై ఎర్రదండు గర్జించింది. శ్రమ జీవులను దోచుకుని, ప్రజల సంపదను పెట్టుబడి దారులకు కట్టబెడుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ధ్వజమెత్తారు. పాలకొండలోని ఓ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లా మహసభలను శనివారం ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో నర్సింగరావు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. విశాఖలోని భూములు పెట్టుబడి దారులకు కట్టబెతున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎన్నికల ముందు కథలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడంలేదని ప్రశ్నించారు. కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ కార్మికుల పొట్టేకొడుతున్న కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు కొనసాగిస్తామని తెలిపారు. కార్మిక వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, సీనియర్ నాయకులు ఎం.తిరుపతిరావు, మన్మథరావు మాట్లాడారు. జిల్లాలోని పలు కార్మిక యూనియన్‌లకు చెందిన నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కూటమి తీరుపై గర్జించిన ఎర్రదండు