
ప్రజలతో మమేకమవుతా..
సాక్షి, పార్వతీపురం మన్యం: అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ఆయన శనివారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలతో మమేకమై సమస్యలపై అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటు..
వెనుకబడిన ప్రాంతమైన మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమాభివృద్ధికి, విద్య, వైద్య రంగాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పాలనపై త్వరగా పట్టుసాధిస్తానని, ప్రజాప్రతి నిధులు, అధికారులతో కలిసి జిల్లా సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు. గతంలో కంటే మన్యం జిల్లాలో అభివృద్ధి పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ కోరారు. అనంతరం జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకొని దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
సమస్యలను అధ్యయనం చేసి, పరిష్కారానికి కృషిచేస్తా
అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నడపడమే ధ్యేయం
మన్యం జిల్లాకు రావడం ఆనందంగా ఉంది
నూతన కలెక్టర్ ప్రభాకర రెడ్డి