
ఐదో సారీ..!
● పత్తికాయవలస రేషన్ డీలర్ తొలగింపు
● నాలుగుసార్లు కోర్టు నుంచి అనుమతి
● తాజాగా ఐదోసారి అడ్డగోలుగా
తొలగింపు
● ఎలాంటి నోటీసులు లేకుండానే
డిపో స్వాధీనం
● కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల పర్వం కొనసాగుతోంది. వారికి అనుకూలంగా లేకపోతే ఉద్యోగమైనా, ఉపాధి అయినా వేరే ఇంకేదైనా సరే వేటు తప్పడం లేదు. గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయనక్కర్లేదు కూటమి నాయకులకు అనుమానం వస్తే చాలు తక్షణమే అలాంటి వారిపై వేటు పడుతోంది. మా ఊళ్లో మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. వాడు మనవాడు కాదు. ఒక్క చూపు చూడండని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తే చాలు. వెంటనే అక్కడి నుంచి అధికారులకు ఫోన్లు రావడం అధికారులు రంగప్రవేశం చేయడం ఏళ్ల తరబడి పని చేస్తున్న వారి పొట్ట కొట్టడం. దీనికి చీపురుపల్లి మండలంలోని పత్తికాయవలస గ్రామంలో రేషన్ డిపో ఉదంతం అద్దం పడుతోంది. అక్కడి రేషన్ డిపో డీలర్ నీలకంఠంను ఎలాగైనా తొలగించాలని కూటమి నేతలు కంకణం కట్టుకున్నారు. దీని కోసం కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచే చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల కాలంలో ఇప్పటికి నాలుగుసార్లు ఆ డీలర్‌ను తొలగించగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నాడు. అయినప్పటికీ శాంతించని నేతలు ఆదేశాల మేరకు అధికారులు మరోసారి సోమవారం వేటు వేశారు. దీంతో పత్తికాయవలస డీలర్ తొలగింపు లెక్క ఐదోసారికి చేరుకుంది. ఏడాదిలో ఐదుసార్లు తొలగించడం వెనుక రాజకీయ కక్ష ఉందని మరోసారి న్యాయ పోరాటం చేస్తానని డీలర్ నీలకంఠం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఎలాంటి నోటీసు లేకుండానే..
అధికార పార్టీ ఒత్తిళ్లతో తోనా? లేక మరింకేమైనా ఉందో గాని సోమవారం ఉదయం 11 గంటలకే పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది డీలర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పత్తికాయవలస రేషన్ డిపోకు వెళ్లారు. అక్కడ డీలర్ లేకుండానే డిపోకు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న డీలర్ నీలకంఠం అక్కడికి చేరుకుని తనకు సమాచారం లేకుండా ఎలాంటి నోటీసు లేకుండా రేషన్ డిపోకు తాళం ఎలా వేస్తారని, తగిన కారణాలు చూపించి నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించాడు. దీంతో సాయంత్రం తహసీల్దార్ ధర్మరాజు, పోలీసులు డిపో వద్దకు వెళ్లారు. రేషన్ డిపోను స్వాధీనం చేసుకుని లోపల ఉన్న సరుకులను వేరే గ్రామ డీలర్‌కు అప్పగించారు.
ఏడాదిలో ఐదు సార్లు తొలగింపు
ఇదిలా ఉండగా పత్తికాయవలస రేషన్ డిపో డీలర్‌ను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఐదుసార్లు తొలగించడం విశేషం. ఇంతవరకు నాలుగు సార్లు హైకోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకుని డీలర్‌గా కొనసాగుతున్నాడు. 2025 ఫిబ్రవరిలో కూడా నాలుగో సారి హైకోర్డు నుంచి అనుమతులు తెచ్చుకున్నాడు.
నాపై కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నాపై కక్ష సాధింపు జరుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు ఎలాంటి కారణం లేకుండానే సస్పెన్షన్ విధించారు. నాలుగు సార్లు హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెచ్చుకున్నాను. అయినప్పటికీ మళ్లీ నా పొట్టకొట్టేందుకు సిద్ధపడ్డారు. మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేస్తాను.
– నీలకంఠం, రేషన్ డిపో డీలర్,
పత్తికాయవలస, చీపురుపల్లి మండలం
ఫిర్యాదు మేరకు చర్యలు
పత్తికాయవలస డీలర్‌పై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు అందాయి. వృద్ధులు, దివ్యాంగుల వేలిముద్రలు వేయించుకుని సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై సీఎస్‌డీటీ నేతృత్వంలో విచారణ నిర్వహించాం. దీంతో పాటు డిపోలో సరుకుల నిల్వలో కూడా తేడాలు ఉన్నట్లు సీఎస్‌డీటీ, క్షేత్రస్థాయి అధికారులు గుర్తించి రిపోర్టు సమర్పించారు. దీనిపై విచారణ చేసి రేషన్ డిపో స్వాధీనం చేసుకుని పక్క గ్రామం డీలర్‌కు అప్పగించాం. పూర్తి నివేదికను ఆర్‌డీఓకు సమర్పిస్తున్నాం. ఆర్‌డీఓ నేతృత్వంలో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
– డి.ధర్మరాజు, తహసీల్దార్, చీపురుపల్లి

ఐదో సారీ..!