
రోజుకో పంచలో పాఠశాల
● గోడు వెళ్లబోసినా పట్టించుకోని
మంత్రి సంధ్యారాణి
సాలూరు రూరల్: మండలంలోని గంగన్న దొరవలస ప్రాథమిక పాఠశాలను రోజుకో పంచలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నారు. పాఠశాల పాతభవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తభవనం నిర్మాణానికి గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేశారు. అయితే అప్పట్లో పనులు ప్రారంభించినప్పటికీ ఎన్నికల కారణంగా మధ్యలో భవన నిర్మాణం నిలిచిపోవడంతో విద్యార్థులకు నీడలేకుండా పోయింది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన చిన్న రేకుల షెడ్డులో 1,2 తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే 3,4,5 తరగతులు గ్రామంలో ఎవరి గడప ఖాళీగా ఉంటే వారి గడపలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితి ఏడాదిగా కొనసాగుతున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం పాఠశాల భవనానికి నిధులు మంజూరై ఉన్నప్పటికీ పనులు కొనసాగించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తామని ఒక వైపు ఊకదంపు డు ప్రచారం చేస్తుంటే మరోవైపు గ్రామాల్లో విద్యార్థులకు నిలువ నీడలేకుండా పోతోంది.
మంత్రికి విన్నవించినా స్పందన శూన్యం
5 నుంచి పది సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు తమకు విద్యాబోధనకు ఒక చిన్న భవనాన్ని నిర్మించండి. రోజుకో పంచలో మా చదువులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి ఏడాది కాలంగా జరుగుతోందని ఇటీవల కురుకూటి గ్రామంలో జరిగిన కూటమి ప్రభుత్వం తొలిఅడుగు సుపరిపాలన కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి సంధ్యారాణి కాన్వాయిని అడ్డుకుని గ్రామస్తులతో పాటు విద్యార్థులు విన్నవించుకున్నారు. అయితే ఆ సమయంలో వినతిపత్రం ఇస్తున్నట్లు సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను మంత్రి సంధ్యారాణి దగ్గరుండి మరీ తొలగించినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. వినతి పత్రం ఇస్తున్నట్లు తీసిన ఫొటోలు తొలగించడంపై గ్రామంలో ఉన్న ఆ పార్టీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు.

రోజుకో పంచలో పాఠశాల