
తోటపల్లి పాత ఆయకుట్టుకు నీరు విడుదల రేపు
వీరఘట్టం: తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు ఈ ఏడాది ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో నీరందించి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈనెల 16న బుధవారం తోటపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ ఏఈ డీవీ రమణ సోమవారం తెలిపారు. ఈ జలాశయం పరిధిలో ఉన్న చెరువులను తొలుత నింపేందుకు లక్ష్యంగా చేసుకున్నామన్నారు. అనంతరం ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పరిధిలో పాత ఆయకట్టు కుడి, ఎడమకాలువ పరిధిలో ఉన్న 64 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి పంపిణీ చేస్తామని చెప్పారు.
రోగులతో ఏరియా ఆసుపత్రి కిటకిట
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. ఒక్కరోజే సోమవారం 442 ఓపీ వచ్చింది. వారిలో 94 మంది జ్వరాలతో బాధపడుతూ రాగా వైద్యులు రక్తపరీక్షలు నిర్వహించారు. మలేరియా ఆర్‌డీటీ కిట్‌లో 18 మందికి పాజిటివ్ రాగా, స్లైడ్ మలేరియా పోజిటివ్ ఒక కేసు వచ్చింది. 49 మందిని ఇన్‌పేషెంట్లుగా జాయిన్ చేసుకుని వారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరెంటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. మిగతా వారికి తగిన ట్రీట్‌మెంట్ ఇచ్చి మందులు పంపిణీ చేశామన్నారు.
23 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
శృంగవరపుకోట: జిల్లా కేంద్రం విజయనగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జిల్లాస్థాయి చాంపియన్ షిప్, సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఇందుకూరి రఘురాజు సోమవారం తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోషియేషన్ సీఈఓ శ్రీరాములు మాట్లాడుతూ 23న పోటీలు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఈనెల 20తేదీ లోగా ప్రవేశ రుసుము జి.తేజేశ్వరరావు(9440505275)పార్వతీపురం, కె.అపర్ణబాబా(7981111705)బొబ్బిలి, ఎం.డి.అబ్దుల్(9515729785)సాలూరు, పి.శ్రీరాములు(7989199534)ఎస్‌కోట, కొత్తవలస(9030185690)వై.గణేష్, జి.శ్రీనివాసరావు(9133773485)–విజయనగరం, కె.వేణుగోపాల్(9866933193) చీపురుపల్లిలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఏ కేటగిరిలో అయినా ఆరు టీముల కన్నా తక్కువ టీములు హాజరైతే ఆ కేటగిరిలో చాంపియన్‌షిప్ నిర్వహించబోమని విజేతలకు అదే రోజు బహుమతి ప్రదానం చేస్తారని స్పష్టం చేశారు.
జేఎన్‌టీయూ జీవీలో ఎమర్జింగ్ టెక్నాలజీపై సర్టిఫికేషన్ కోర్సు
విజయనగరం అర్బన్: జేన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ)లో ‘ఎమర్జింగ్ టెక్నాలజీ’ కోర్సుకు సంబంధించి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కోర్సుల ద్వారా సంబంధిత నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి కోర్సులను భవిష్యత్తులో మరిన్ని యూనివర్సిటీ అందిస్తుందన్నారు.
కోటదుర్గ ఆలయంలో హుండీ చోరీ
సాలూరు: పట్టణంలోని కోటదుర్గ అమ్మవారి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయంలో దొంగలు పడి హుండీని పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అర్చకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

తోటపల్లి పాత ఆయకుట్టుకు నీరు విడుదల రేపు

తోటపల్లి పాత ఆయకుట్టుకు నీరు విడుదల రేపు