
కలెక్టర్‌ను కలిసిన ఎస్‌ఈ
పార్వతీపురంటౌన్: ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన కె.మల్లిఖార్జున రెడ్డి గురువారం కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఈ సందర్భంగా ఎస్‌ఈకి కలెక్టర్ సూచించారు.
12న రాష్ట్ర స్థాయి సమావేశం
పాలకొండ రూరల్: ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఉపాధ్యాయుల వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో గుంటూరు తాడేపల్లి పరిధి సీఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 12 రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుందని, ఉద్యోగులందరూ హాజరుకావాలని అసోసియేషన్ పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు బోసు మన్మథరావు మాదిగ గురువారం ఒక ప్రకటనలో కోరారు. వర్గీకరణ అనంతరం తొలి సమావేశం కావడంతో జిల్లా నుంచి పెద్ద ఎత్తున తాడేపల్లికి ఉద్యోగులు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో సమస్యలపై భవిష్యుత్తు కార్యాచరణపై చర్చ ఉంటుందన్నారు. కార్యక్రమం ద్వారా ఐక్యత చాటాలని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర నాయకులు అలజంగి చిన్నారావు, యామల సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు.
ఎగువ సంకిలికి ఏనుగులు
సీతంపేట: మండలంలోని ఎగువ సంకిలి పరిసర ప్రాంతాల్లో గురువారం ఏనుగులు సంచరిస్తున్నట్టు గిరిజనులు తెలిపారు. గత వారం రోజులుగా చిన్నబగ్గ–గోరపాడు జీడితోటల్లో ఉన్న నాలుగు ఏనుగులు ఇప్పుడు ఎగువ సంకిలి పరిసరాల్లోకి చేరడంతో గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు. పైనాపిల్, అరటి, కొండచీపుర్ల పంటలు నాశనం చేస్తున్నాయంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు ఎఫ్‌బీఓ కె.దాలినాయుడు తెలిపారు. ఏనుగులు సంచరించే వైపు ఎవ్వరూ వెళ్లవద్దని సూచనలిస్తున్నామన్నారు.
మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ప్రజలకు మరింత చేరువకావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు గురువారం ఒక రోజు వర్క్‌షాప్, ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం చాలా సులువైనది, ఖర్చులేనిదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనీ మీడియేటర్స్ వచ్చి న్యాయవాదులందరికీ శిక్షణ అందిస్తున్నారన్నారు. ఈ స్టాల్ జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వలంటీర్స్ నిర్వహిస్తున్నారని, వారు ప్రజలకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది
● పీటీఎంలో చైర్మన్ ఆవేదన
చీపురుపల్లి: మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తరచూ విద్యార్థులు తల్లిదండ్రులే స్వయంగా వచ్చి చెబుతున్నారు. ఇదేదో తాను వ్యక్తిగతంగా చెబుతున్నది కాదు. తల్లిదండ్రులు అంతా చెబుతుండడంతోనే అందరి ఎదుట చెప్పాల్సి వస్తోంది. దయచేసి మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతీసుకునేలా చర్యలు చేపట్టండి. అలాగే కొంతమంది విద్యార్థులకు బ్యాగులు కూడా ఇవ్వలేదు. పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు కష్టాలు దూరంచేసేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఎదుట సాక్షాత్తూ అదే పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్ ఏకరువు పెట్టారు. పాఠశాలలో సమస్యలు పరిష్కారమవుతాయనే ఎమ్మెల్యే ముందు చెప్పాల్సి వస్తోందని ఆయన చెబుతున్నప్పటికీ పాఠశాల హెచ్‌ఎంతో సహా కొంతమంది ఉపాధ్యాయులు ప్రసంగం ఆపేయమని పక్క నుంచి షర్టు లాగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.