
ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం
● పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో కూటమి వైఫల్యం ● ప్రమాణాలు చేస్తున్నామంటూ ఇచ్చిన బాండ్‌లకు విలువ ఎక్కడ..? ● బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై ఇంటింటా ప్రచారం ● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 5 వారాల బృహత్తర కార్యక్రమం ● హామీలు అమలుపై ప్రజలతో చర్చించి చైతన్యవంతులు చేయండి ● పార్టీ శ్రేణులకు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు ● వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు ● జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
●హామీలను విస్మరించడం దగా చేయడం కాదా..?
ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఎన్నికల ప్రణాళికలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికల ప్రణాళికలను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబుల్‌గా భావించి అమలు చేశాం. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అలానే అమలు చేస్తుందని 5 కోట్ల మంది ప్రజలు నమ్మి మోసపోయారు. ఏడాది కాలం మాయమాటలతో పబ్బంగడిపేసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికారం పక్షం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను మెడలు వంచి అమలు చేసేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామంటూ బాండ్ పేపర్లు ఇచ్చారు. ఏడాదిగా ప్రతిజ్ఞను పక్కనపెట్టి మోసం చేస్తున్నారు. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి
విజయనగరం:
ఎన్నికలకు ముందు అధికార దాహంతో ఇచ్చిన హామీల అమలు కోసం కూటమి ప్రభుత్వం మెడ లు వంచేందుకు సిద్ధమని శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉద్ఘాటించారు. పవిత్రమైన ఎన్నికల ప్రణాళిక అమల్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. హామీల అమలుపై ప్రశ్నించేవారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండించా రు. ఏడాది పాలనలో హామీల అమల్లో జరుగుతు న్న మోసాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ప్రజలకు వివరించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన బాబుష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తుచేస్తూ 5 వారాల బృహత్తర కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సూచించారు. ముందుగా నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని, అనంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి కార్యక్రమా న్ని అందరికీ తెలియజేయాలన్నారు. అనంతరం మండల స్థాయి నాయకులు గ్రామగ్రామానికి వెళ్లి అక్కడి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచా రం చేసిన అనంతరం ఆ గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసి కూటమి పాలనను వివరించాలన్నా రు. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు ప్రజలే జగన్‌మోహన్‌రెడ్డి కావాలో.... చంద్రబాబు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన పూల్‌బాగ్ లోని ఓ కల్యాణమండపంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ముందు గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
గ్రామాల్లో చేసిన వాగ్దానాలను ప్రశ్నించాలి
కూటమి నాయకులు ఎన్నికలకు ముందు గ్రామాల్లోకి వచ్చి చేసిన వాగ్దానాలపై ప్రశ్నించాలి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలను చెప్పేందుకే బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్రమం. జగన్‌మోహన్‌రెడ్డి న్యాయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే.. కూటమి నేతలు మాయమాటలతో పాల న చేస్తున్నారు. 150 హామీలు ఎక్కడ అమలు చేశారో... ఎవరికి చేశారో చెప్పాలి. ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ పేరిట భయపెడుతున్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను ప్రజల్లో నిలదీయాలి.
– పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు
భస్మాసురిడిలా లోకేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ కూటమి ప్రభుత్వానికి భస్మాసురిడిలా తయారయ్యాడు. రెడ్ బుక్‌లో అందరి జాతకాలు ఉన్నాయంటూ చివరికి ఆ అస్త్రంతోనే కూటమి ప్రభుత్వాన్ని, తన పక్కనున్న వారిని భస్మం చేసే పరిస్థితి వస్తుంది. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్దాం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కుచెదరలేదు. 2029 ఎన్నికల్లో మళ్లీ క్లీన్‌స్వీప్ చేస్తాం.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం

ప్రభుత్వం మెడలు వంచుదాం.. హామీలు అమలు చేయిద్దాం